
Shooting At Pittsburgh: అమెరికా అగ్రరాజ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గన్ కల్చర్ కు సోదాహరణగా సాయుధులు యధేచ్ఛగా కాల్పులకు తెగబడ్డారు. అత్యాధునిక ఆయుధాలు చేతపట్టిన దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్ నగరంలో గన్ కల్చర్ పేట్రేగిపోయింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ పార్టీలో కాల్పుల మోత మోగింది. మాస్ షూటింగ్‌లో ఇద్దరు మరణించినట్లు పిట్స్‌బర్గ్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మైనర్లు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డరని పోలీసులు తెలిపారు.
ఈ పార్టీకి 200 మందిపైగా పాల్గొన్నారని.. ఇందులో చాలా మంది టీనేజ్ వారే ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు కాల్పులు జరిగాయని పిట్స్‌బర్గ్ పోలీసులు ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరూ చనిపోగా.. 11 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదన్నారు.
ఈ కాల్పుల సమయంలో పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డారని, మరికొందరూ భవనం కిటికీల నుండి దూకి గాయపడినట్టు అధికారులు తెలిపారు. కాల్పుల వల్ల భయాందోళనకు గురైన అక్కడి వారు వీధుల్లోకి పరుగులు తీశారు. అక్కడ నుంచి పారిపోయాలని నానా విధాలు ప్రయత్నించారు. ఈ పార్టీలో దాదాపు 50 రౌండ్లు కాల్పులు జరిగాయని, పార్టీ వేదిక బయట కూడా పలు రౌండ్ల కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రైఫిల్స్, పిస్టల్స్, షెల్ కేసింగ్‌లు కనిపించాయని పిట్స్‌బర్గ్ పోలీసు కమాండర్ జాన్ ఫిషర్ మీడియాకు తెలియజేశారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసినట్టు, క్రైమ్ సన్నివేశాల వద్ద సాక్ష్యాలను ప్రాసెస్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కాల్పులకు తెగబడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకూ ఎటువంటి అరెస్టులు చేసినట్టుగానీ, అనుమానితుల సమాచారాన్ని పోలీసులు విడుదల చేయలేదు.