సెల్యూట్ కల్నల్ సంతోష్ బాబు.. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ.. 15 ఏళ్లుగా దేశ సేవలో..

By Sumanth KanukulaFirst Published Mar 31, 2022, 12:44 PM IST
Highlights

దేశ రక్షణలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ వీర మరణం పొందారు. గల్వాన్‌ లోయలో చైనా  చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్‌ కూడా ఒకరు. 

దేశ రక్షణ కోసం సరిహద్దు లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులు సేవల వెలకట్టలేనివి. కుటుంబాలకు దూరంగా.. ప్రతికూల వాతావరణంలో సరిహద్దుల వెంట శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వారు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో పహారా కాస్తుంటారు. మొక్కవోని ధైర్యంతో భరతమాత సేవలో తరిస్తున్నారు. అయితే దేశ రక్షణ కోసం జరుగుతున్న పోరులో పలువురు సైనికులు వీర మరణం పొందుతున్నారు. అలా దేశ రక్షణలో తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ వీర మరణం పొందారు. గల్వాన్‌ లోయలో చైనా  చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్‌ కూడా ఒకరు. 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన  ఉపేందర్, మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్‌‌.. 1 నుంచి 5వ తరగతి స్థానికంగా విధ్యాభ్యాసం కొనసాగించారు.  బాల్యం నుంచే సంతోష్‌కు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉండేది. ఈ క్రమంలోనే ఆయన 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యనభ్యసించారు. అనంతరం పుణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. 

ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్‌లో లెఫ్ట్‌నెంట్‌గా బిహార్‌ రెజిమెంట్‌ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరాడు. విధుల్లో భాగంగా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు.  2007లో సరిహద్దుల్లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. సంతోష్‌ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. 2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి వచ్చింది. ఇక, సంతోష్‌కు భార్య సంతోషి.. కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు.

బిహార్‌ 16వ బెటాలియన్‌ కామాండింగ్‌ అధికారిగా ఉన్న కల్నల్‌ సంతోష్‌బాబు.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్‌ లోయల్లో విధులకు వెళ్లారు. చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తొప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్‌తో పాటు 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. 

కల్నల్ సంతోష్ బాబు సేవలకు మరణానంతరం రెండవ అత్యున్నత సైనిక శౌర్య పురస్కారం మహావీర్ చక్రను కేంద్రం ప్రకటించింది. వీరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహావీర చక్ర పురస్కారాన్ని సంతోష్ బాబు తల్లి, భార్యకు అందజేశారు. 

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కూడా చేయూత అందించింది. సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం  కేసీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంతోష్ బాబు కుటంబానికి సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయంతో పాటు, బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం, ఆయన సతీమణికి గ్రూపు 1 స్థాయి ఉద్యోగాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. సంతోష్ బాబు త్యాగాన్ని స్మరిస్తూ సూర్యాపేట పట్ణంలోని  కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా గా  నామకరణం చేశారు. కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలు గుర్తు చేసి స్ఫూర్తి రగిలించేలా ఆయన 10 అడుగుల కాంస్య  విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

click me!