టర్నింగ్ పాయింట్: స్టోక్స్ చేసిన నమ్మశక్యం కాని పని ఇదే...

By telugu teamFirst Published Jul 15, 2019, 11:09 AM IST
Highlights

కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్న బెన్ స్టోక్స్ ఓవైపు ఉన్నాడు. న్యూజిలాండ్ వేసిన చివరి ఓవర్‌లో మొదటి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్‌ సిక్సర్‌గా మలిచాడు. మరో  మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. 

లండన్: ఇంగ్లాండు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ పై జరిగిన ఫైనల్ మ్యాచులో బ్యాట్ తో వీరోచితంగా పోరాడాడు. కానీ, అతను చేసిన పనికే న్యూజిలాండ్ ఇంటి దారి పట్టి, ఇంగ్లాండు కప్ ను ఎగురేసుకుపోయింది. తాను కావాలని చేయలేదని, అందుకు కివీస్ కెప్టెన్ కానే విలియమ్సన్ కు జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటానని అతను అన్నాడు. 

బెన్ స్టోక్స్ తప్పు చేసినా చేయకపోయినా మ్యాచ్ ను మలుపు తిప్పి విజయాన్ని ఇంగ్లాండు ఖాతాలో వేసింది మాత్రం అతనే. విరోచితంగా పోరాడినప్పటికీ న్యూజిలాండ్ కు అదృష్టం కలిసి రాలేదని చెప్పడానికి ఇదో ముఖ్యమైన ఉదాహరణ. మ్యాచ్ 50 ఓవర్‌లో జరిగిన అనూహ్యమైన ఘటన కివీస్‌ జట్టును ఓటమి పాలు చేసింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్‌ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. 

కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్న బెన్ స్టోక్స్ ఓవైపు ఉన్నాడు. న్యూజిలాండ్ వేసిన చివరి ఓవర్‌లో మొదటి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్‌ సిక్సర్‌గా మలిచాడు. మరో  మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. 

నాలుగో బంతి వేసిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని స్టోక్స్ డీప్ లోకి తరలించాడు. రెండు పరుగులు తీశాడు. కానీ, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్‌ గుఫ్టిల్‌ విసిరిన బంతి నేరుగా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలింది. అంతే, న్యూజిలాండ్ ఆటగాళ్లకు దిమ్మ తిరిగింది.

స్టోక్స్ బ్యాట్ కు తగిలిన బంతి బౌండరీ దాటింది. దాంతో ఇంగ్లాండుకు ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్‌ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం అందుకునే పరిస్థితి. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి ఇద్దరు రన్నౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 241 పరుగుల వద్ద ఆగిపోయింది. 

దాంతో మ్యాచ్‌ టై అయింది. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌ కూడా టై అయింది. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

click me!