టీఆర్ఎస్ పాలనలో చరిత్ర పునరావృతం అవుతోంది: మంత్రి ఎర్రబెల్లి

By Arun Kumar PFirst Published Dec 14, 2019, 6:57 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో  వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు పేర్కోన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసమే కృషిచేస్తున్నారని అన్నారు.  

హైదరాబాద్:  మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ''రూరల్ డెవలప్మెంట్& ఎస్డీజీ గవర్నెన్స్ టువర్డ్స్ బిల్డింగ్ ఆన్ అగ్రికల్చర్& రూరల్ సెంట్రిక్ ఎకానమీ'' అంశంపై జరిగిన ఈ సదస్సులో కీలకోపన్యాసం చేశారు. 

వ్యవసాయం, రైతుల గురించి ఎర్రబెల్లి మాట్లాడుతూ... నాలుగైదు దశాబ్దాల క్రితం ఉద్యోగాలు వచ్చినా వద్దనుకుని వ్యవసాయం చేసేవారన్నారు.  తన తండ్రి కూడా అలాగే వ్యవసాయం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారని తెలిపారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయని... వ్యవసాయంలో ఖర్చు పెరిగి ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు. దీంతో  క్రమంగా ఒక్కొక్కరూ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది... వ్యవసాయం కంటే ఉద్యోగాలు మేలు అనే భావన మొదలైందన్నారు.

ప్రకృతి విపత్తులతో రైతులకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టం జరుగుతూనే ఉంటోందని పేర్కొన్నారు. అలాంటి విపత్తుల నుండి పంటను కాపాడి రైతులకు నష్టం తగ్గించేలా పరిశోధనలు ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని... వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేని అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 

read more సమత రేప్, హత్య కేసులో చార్జిషీట్: చీరపై స్పెర్మ్ ఆధారంగా నిందితుల గుర్తింపు

''పెట్టుబడి ఖర్చు కోసం రైతులకు ఆసరాగా నిలిచేందుకు ప్రతి ఏటా ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయి.

ఇప్పుడు పొలాలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. రైతుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తున్నారు..

పంటల సాగుకు సంబంధించి రైతులకు సలహాలను, సూచనలను ఇచ్చేందుకు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించారు. ఏ గ్రామంలో ఏ పంట వేస్తే బాగుంటుంది అనే సమగ్ర సమచారాన్ని రైతులకు ఇస్తున్నారు. రైతు సమన్వయ సమితులు సైతం రైతులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. 

క్రాప్ కాలనీల విధానం పూర్తి స్థాయిలో అమలైతే రైతులకు సాగులోనే ఎక్కువ లాభాలు వస్తాయి. రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయి. రైతులకు మంచి ధరలు వచ్చేలా చేసేందుకు అవసరమైన గోదాములను నిర్మిస్తున్నారు. ప్రతి మండలంలో 5 వేల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణం జరుగుతోంది.

read more  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్... సంగారెడ్డిలో హరీష్ మార్కు రాజకీయం

రైతు సంక్షేమం లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలతో కొన్నేళ్లలోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది.  ఇప్పటి యువత ఆలోచన మారుతోంది . ఉద్యోగాల కంటే వ్యవసాయం చేయడానికి ఇష్టపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాభసాటిగా పంటల సాగుతో రైతులు సంతోషంగా ఉంటారు. రైతుల కోసం ఇన్ని పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంలో దేశంలో తెలంగాణ తప్ప ఇంకొక్కటి లేదు'' అంటూ ప్రభుత్వ  పథకాలను. సీఎం కేసీఆర్ ను ఎర్రబెల్లి ప్రశంసించారు. 

ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జువ్వాడి దేవీప్రసాద్ రావు, వ్యవసాయ వర్సిటీ మాజీ డైరెక్టర్ రత్నాకర్, కోరమండల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి.వి.సుబ్బారెడ్డి, వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ జలపతిరావు, అన్నామలై యూనివర్సిటీ ఆర్ఎం కత్రిసన్, ఇక్రిశాట్ సీనియర్ సైంటిస్టు జి.వి.రంగారెడ్డి, విదేశీ ప్రతినిధులు వైకేల్ లివ్, ఫాతిమా జూర పాల్గొన్నారు.

click me!