ఆర్టీసి ''చలో ట్యాంక్‌బండ్'' లో మావోయిస్టులు..: పోలీస్ కమీషనర్ సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Nov 9, 2019, 8:55 PM IST
Highlights

ఆర్టీసి కార్మికులు ఇవాళ(శనివారం) చేపట్టిన ''చలో ట్యాంక్ బండ్'' హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పోలీసులను టార్గెట్ గా చేసుకునే ఈ నిరసన కార్యక్రమం జరిగిందన్నారు.  

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసి కార్మికులు చేపట్టిన ''చలో ట్యాంక్ బండ్'' ఉద్రిక్తలకు దారితీసింది. అయితే ఈ ఉద్రిక్తలకు మావోయిస్టులే కారణమంటూ హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసి కార్మికులు మావోయిస్టులతో చేతులు కలిపి పోలీసులే టార్గెట్ గా ఈ నిరసనకు దిగినట్లు పేర్కోన్నారు.  అందువల్లే ఆర్టీసి ఉద్యోగుల ముసుగులో ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న మావోయిస్టులు పోలీసులపై దాడులకు పాల్పడి గాయపర్చినట్లు సిపి పేర్కొన్నారు. 

ఆర్టీసి ఉద్యోగ సంఘాలు హింసకు పాల్పడే అవకాశం వుందని ముందస్తు సమాచారం అందటంవల్లే వారికి అనుమతి నిరాకరించినట్లు సిపి తెలిపారు. మావోయిస్టు సంఘాలతో వారు చేతులు కలిపినట్లు తమకు ముందుగానే సమాచారం వుందన్నారు. అందువల్లే భారీస్థాయిలో పోలీస్ బలగాలను మొహరించినట్లు తెలిపారు.

అయినప్పటికి ఉద్యోగులతో కలిసి వచ్చిన మావోయిస్టులు పోలీసులపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. వారి రాళ్లదాడిలో దాదాపు ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని...మరికొందరు స్వల్పంగా గాయపడ్డారని అన్నారు. అలా గాయపడినవారిలో అడిషనల్ డిసిపి  రామచంద్రారావు, ఏసిపి రత్నం లు గాయపడినట్లు సిపి వెల్లడించారు.

READ MORE  Chalo Tank Bund : తమ్మినేని వీరభద్రం అరెస్ట్

ఆందోళనకారులు తమపై రాళ్లదాడికి దిగడం వల్లే టియర్ గ్యాస్ ను ఉపయోగించామన్నారు. ఇలా రాళ్లదాడికి దిగి పోలీసులకు గాయపర్చిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు సిపి అంజనీకుమార్ వెల్లడించారు.

అయితే సిపి వ్యాఖ్యలకు ఆర్టీసి జేఏసి కన్వీనర్ అశ్వత్థామ‌రెడ్డి ఖండించారు. చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గోన్నవారంతా ఆర్టీసీ కార్మికులేనని...మావోయిస్టులు ప్రవేశించారన్న సిపి వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. పోలీసులే తమపై చాలా దౌర్జన్యంగా వ్యవహరించారని  ఆయన ఆరోపించారు.  

విజయవంతంగా పూర్తయిన తమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తప్పుడు విధంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మావోయిస్టులున్నారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందులోనూ స్వయంగా పోలీస్ కమీషనరే ఈ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని... ఆయన చేసిన ఆరోపణలు కార్మికులను ఎంతగానో బాధించాయని అశ్వత్థామ‌రెడ్డి అన్నారు.

READ MORE  Chalo Tank Bund : కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

ఈ చలో ట్యాంక్ బండ్ విజయవంతం కోసం పోలీసులు నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా కార్మికులు కదిలారని...వారందరికి పేరుపేరు కృతజ్ఞతలు తెలిపారు. తమ కార్మికులతో పాటు విద్యార్ధి సంఘాలకు, ప్రజా సంఘాలకు కూడా ప్రత్యేకంగా దన్యవాదాలు తెలిపారు అశ్వత్థామ‌రెడ్డి.

click me!