వర్షంలో తడిసిన తర్వాత ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. జలుబు, జ్వరంతో పాటుగా ఆరోగ్యం బాగా పాడవుతుంది. మరి ఇలా కాకూడదంటే ఏం చేయాలో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వర్షంలో తడవడం మర్చిపోలేని అనుభూతి. కానీ వర్షంలో తడిస్తే జలుబు చేయడమే కాకుండా.. దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు, వర్షపు నీటిలో తడవడం వల్ల మన రోగనిరోధక శక్తిని బలహీనపడుతుంది. దీంతో మనం తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వర్షంలో తడిసిన తర్వాత జలుబు, జ్వరం వంటి అనారోగ్యం బారిన పడకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వెంటనే పొడి బట్టలు మార్చుకోవాలి: మీరు అనుకోకుండా వర్షంలో తడిసినట్టైతే మీరు చేయాల్సిన మొదటిపని.. వీలైనంత త్వరగా దుస్తులను మార్చండి. వెంటనే పొడి దుస్తులను వేసుకోండి. తడి బట్టలు శరీర ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తాయి. దీనివల్ల మీకు జలుబు లేదా జ్వరం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ సీజన్ లో మీతో ఒక జత ఎక్స్ ట్రా దుస్తులను తీసుకెళ్లండి.
వేడినీళ్లతో స్నానం: మీరు వర్షంలో తడిసిన తర్వాత వేడినీళ్లతో స్నానం చేయండి. దీనివల్ల మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంటుంది. అలాగే మీకు అంటుకున్న బ్యాక్టీరియాచ కాలుష్య కారకాలు కూడా స్నానం వల్ల తొలగిపోతాయి. గోరువెచ్చని నీళ్లు మీ శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అనారోగ్యం బారిన పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
వెచ్చని పానీయాలు: గోరువెచ్చని నిమ్మకాయ నీరు. హెర్బల్ టీ, లేదా గోరు వెచ్చని పాలు వంటి వెచ్చని పానీయాలను వర్షంలో తడిసిన తర్వాత ఖచ్చితంగా తాగండి. ఇవి మీ గొంతును ఉపశమనం చేయడానికి, అలాగే మిమ్మల్ని లోపలి నుంచి వేడిగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఈ పానీయాలు విష పదార్థాలను శరీరంలో నుంచి బయటకు తీయడానికి, మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడతాయి. అలాగే జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు రాకుండా కూడా ఉంటారు.
రోగనిరోధక శక్తి పెంచండి: మీ రోగనిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడే మీరు జలుబు, జ్వరానికి దూరంగా ఉంటారు. అలాగే అంటువ్యాధులు ఇతర రోగాలతో మీ శరీరం పోరాడుతుంది. అందుకే మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకోండి. లేదా నిమ్మ వంటి సిట్రస్ పండ్లు, బెర్రీలు, ఆకుకూరలు వంటి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి మీరు ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. అలాగే కంటినిండా నిద్రపోవాలి.
చల్లని, అపరిశుభ్రమైన ఆహారాలకు దూరంగా: వర్షంలో తడిసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మీరు అపరిశుభ్రమైన, చల్లని ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఇది మీ కడుపునకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ఇంట్లో చేసిన తేలికపాటి , వేడి వేడి ఆహారాన్ని తినండి. స్ట్రీట్ ఫుడ్ ను అస్సలు తినకండి.