
హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల సంఖ్య బాగా తగ్గడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉండటాన్ని కూడా రక్తహీనత సమస్య అనొచ్చు. అయితే ఈ రక్తహీనత సమస్య వల్ల అలసట, ఒంట్లో శక్తి లేకపోవడం, మైకము, ఏ పని చేతకాకపోవడం, ఏదీ చేయాలనిపించకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
అయితే రక్తహీనత సమస్యను పోగొట్టడానికి ఐరన్ కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాల పదార్థాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. అలాగే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు సహాయపడతాయి. మరి శరీరంలో రక్తం పెరగాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రిస్ పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే బెర్రీలు, కివి, ఆకుకూరలు, ఉసిరి, టమోటాలు కూడా ఇనుము శోషణకు సహాయపడతాయి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోండి.
విటమిన్ ఎ
క్యారెట్లు, చిలగడదుంప, నేరేడు పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మీ శరీరంలో ఇనుము శోషణకు కూడా సహాయపడుతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
బీట్ రూట్
బీట్ రూట్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. బీట్రూట్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఫైబర్ లు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఖర్జూరాలు
ఖర్జూరాలు పోషకాల భాండాగారం. వీటిలో ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తింటే మీ శరీరంలో రక్తానికి కొరత ఉండదు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది.
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండ్లలో క్యాల్షియం, ఐరన్, స్టార్చ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.