మలబద్దకంతో బాధపడుతున్నారా? ఈ సమ్మర్ ఫ్రూట్స్ తో సమస్య మటుమాయం..!

By Mahesh RajamoniFirst Published Mar 19, 2023, 9:49 AM IST
Highlights

ఉష్ణోగ్రతలు ఎక్కువైతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అందుకే ఈ సీజన్ లో  మలబద్దకం బారిన ఎక్కువ మంది పడుతుంటారు. అయితే  కొన్ని రకాల పండ్లు, కూరగాయలను తింటే సమస్య నుంచి గట్టెక్కొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


మలబద్ధకం అనేది మల విసర్జనలో ఇబ్బందిని కలిగించే సమస్య. దీనివల్ల మలవిసర్జన సాఫీగా ఉండదు. మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రేగు కదలికలు ఉండకపోవచ్చు. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలు మలబద్దకాన్ని సూచిస్తాయి. ఫైబర్ ఫుడ్స్ ను తక్కువగా తీసుకోవడం లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీటిని తాగకపోవడం, ఒత్తిడికి ఎక్కువగా గురికావడం వంటి పేలవమైన ఆహార అలవాట్ల వల్లే మలబద్దకం సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వేడి వాతావరణం, చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోంచి నీరంతా బయటకు పోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మన శరీరంలో వాటర్ కంటెంట్ సరిగ్గా లేకుంటే మలబద్దకం సమస్య వస్తుంది. 

చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాలను రోజూ తిన్నా మలబద్దకం సమస్య వస్తుంది. భోజనం తర్వాత తీపి పదార్థాలను తినాలని అనిపిస్తుంది. కానీ ఇది మలబద్దకానికి దారితీస్తుంది. ఇప్పటికే ఉన్న సమస్యను ఎక్కువ చేస్తుంది. అయితే వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉన్నపండ్లను తింటే మీ గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ సీజన్ లో పండే కొన్ని పండ్లను తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేంటంటే.. 

ఆపిల్స్

గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి ఆపిల్ ఎంతో సహాయపడుతుంది. ఆపిల్స్ లో పెక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి సేంద్రీయ ఆపిల్స్ ను వాటి స్కిన్ తో సహా తినేయండి.

నారింజ

మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడే మరో గొప్పపండు నారింజ. తీయగా, జ్యూసీగా ఉండే ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు నారింజ విటమిన్ సి కి మంచి మూలం. ఇది యాంటీఆక్సిడెంట్. ఇది మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

బొప్పాయి

మరో వేసవి పండు అయిన బొప్పాయిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. క్రమం తప్పకుండా ఉదయం లేదా మధ్యాహ్నం ఈ పండును తింటే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అలాగే పేగుల గుండా వెళ్లడం సులభం చేస్తుంది. బొప్పాయిలో ఫైబర్, వాటర్ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ పండు ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

నల్ల ఎండుద్రాక్ష 

మీరు మలబద్దకంతో బాధపడుతుంటే ఖచ్చితంగా మీ రోజువారి ఆహారంలో నల్ల ఎండుద్రాక్షలు, ఎండు ద్రాక్షలను మర్చిపోకుండా చేర్చండి. వీటిని నీటిలో నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తినడం వల్ల క్రమం ప్రేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. మలబద్దకం సమస్య పోతుంది.

click me!