
ఆహారాన్ని నమిలి మింగిన తర్వాత కడుపు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఫైబర్ కంటెంట్ లేని ఆహారాన్ని తింటే 45 నిమిషాల తర్వాత మీరు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం లేదా తగ్గడం మొదలవుతుంది. ఈ హెచ్చుతగ్గులను నివారించడానికి ఫైబర్ కంటెంట్ ఆహారం బాగా సహాయపడుతుంది. అయితే మీరు తినే భోజనంలో ఫైబర్ కంటెంట్ ఉంటే ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అసలు ఫైబర్ కంటెంట్ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యంగా బరువు తగ్గడం
డైటరీ ఫైబర్ ను ఎక్కువగా తీసుకుంటే మీరు సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మీ కడుపు తొందరగా నిండేలా చేస్తాయి. అలాగే మిమ్మల్ని ఎక్కువసేపు సంతృప్తిగా ఉంచుతాయి. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. ఫైబర్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
ఫైబర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఫైబర్ కంటెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ గుండెపోటు తర్వాత గుండెను తిరిగి ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.
మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది
మనం తినే ఫుడ్ మన నిద్రపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. ఇటీవల జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. సంతృప్త కొవ్వు, చక్కెర తక్కువగా ఉన్న అధిక ఫైబర్ ఆహారాలను తినడం వల్ల ఎక్కువ సేపు, గాఢంగా నిద్రపోయారు. నిద్రలేమితో బాధపడేవారికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం బాగా సహాయపడుతుంది.
రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
తాజా హార్వర్డ్ అధ్యయనం ప్రకారం.. ఒక మహిళ టీనేజ్ లేదా యవ్వనంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ తీసుకునే ప్రతి అదనపు 13 గ్రాముల డైటరీ ఫైబర్ కు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 10% తగ్గుతుంది.
ప్రేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది
ఫైబర్ క్రమబద్ధతను ప్రోత్సహించడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్, మలబద్ధకం లక్షణాలను మెరుగుపరుస్తుంది. నిపుణుల ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, సప్లిమెంట్స్ మలం సులువుగా బయటకు వచ్చేందుకు సహాయపడతాయి.