అవినీతి అధికారులపై తాము చర్యలు తీసుకుంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి స్థానంలో వున్న చంద్రబాబు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి కొన్ని విధివిధానాలు వుంటాయని... వాటిని ప్రతిఒక్కరు పాటించాల్సి వుంటుందని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వాటినే మార్షల్స్ పాటించారని... దీనిపై టిడిపి నాయకులు రాద్దాంతం చేయడం తగదని సూచించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే కాదు అవసరమైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా మార్షల్స్ తనిఖీ చేస్తారని అన్నారు.
నలభయ్యేళ్ల సీనియర్ రాజకీయ నేత చంద్రబాబకు ఇవన్నీ తెలిసే అనవసరపు రాధ్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీని సజావుగా నడవకుండా చేయడమే టిడిపి పనిగా పెట్టుకుందని... ఇందులో భాగమే మార్షల్స్ పై ఆరోపణలని అంబటి పేర్కొన్నారు.
ఇక ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేయడంపై కూడా చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ నివేదిక ప్రకారమే ఈడీబీ మాజీ సీఈఓ కృష్ణ కిషోర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని వివరించారు.
read more ఎన్నికల హామీలన్ని పూర్తయినట్లే...మిగిలింది అదొక్కటే: మల్లాది విష్ణు
తప్పు చేసిన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడుతో పాటు కొందరు ఎక్కువగా స్పందిస్తున్నారని అన్నారు. కృష్ణ కిషోర్ ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
జగతి పబ్లికేషన్స్ పై సీబీఐ నమోదు చేసిన కేసులో అప్పటి ఐటీ అధికారిగా ఈయన ప్రమేయం వున్నట్లు... అందువల్లే సస్పెండ్ చేశారని చంద్రబాబు అనడాన్ని అంబటి తప్పుబట్టారు. నిజానిజాలు తెలుసుకుని చంద్రబాబు మాట్లాడితే బావుంటుందని హెచ్చరించారు.
జాస్తి కృష్ణ కిశోర్ తో పూర్వపు సంబంధం ఉంది కాబట్టే ఆయన్ని చంద్రబాబు ఏపికి డిప్యుటేషన్ పై తీసుకువచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు జేడీ లక్ష్మీనారాయణ, వెంకయ్య చౌదరి లాంటి కొందరు అధికారులను తనకు అనుకూలంగా ఉండేలా చంద్రబాబు చూసుకున్నారని అన్నారు.
read more విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు... వైసిపి నేత సంచలనం
వీరంతా కలిసి తప్పుడు కేసులు పెట్టి జగన్ ను జైలుకు పంపి కక్ష సాధించారని అన్నారు. కానీ తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించే అవసరం లేదని...మరీ ముఖ్యంగా ఉద్యోగులపై అస్సలు లేదని అంబటి అన్నారు.