హిందూమతంపై జగన్ సర్కార్ దాడి...వారి టార్గెట్ అదే...: బోండా ఉమ

By Arun Kumar P  |  First Published Nov 12, 2019, 9:03 PM IST

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టతను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు బోండా ఉమ ఫైర్ అయ్యారు. ఇప్పుడు వారి ఆగడాలు ఇతర దేవాలయాలకు కూడా పాకాయని బోండా ఆరోపించారు.  


అమరావతి: వైసీపీ ప్రభుత్వ ప్రోద్భలంతోనే హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందని, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటిలోనూ అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయని  టీడీపీ మాజీఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భక్తులను కలిగిన పవిత్రమైన క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందిన తిరుమలలో అన్యమతానికి చెందినవారిని వివిధ విభాగాల కింద ప్రభుత్వం ఉద్యోగులుగా నియమిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. 

మంగళవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించినట్లుగానే హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం విచ్చలవిడిగా జరిగేలా ప్రభుత్వమే ప్రోత్సహించడం బాధాకరమన్నారు. కలియుగ వైకుంఠమైన వేంకటేశ్వరస్వామి విషయంలో వైసీపీనేతలు, ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, కొండపైన పనిచేసే ఉద్యోగులు, రోజువారీ కూలీలుగా అన్యమతస్తులను నియమిస్తున్నారని ఉమా మండిపడ్డారు.

Latest Videos

సదరు ఉద్యోగులు వారిమతాల గురించి, మతగ్రంథాలను చేతపట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నా రని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. గతంలో తిరుమలకొండపై నడిచే ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లపై జెరూసలెం యాత్రకు సంబంధించిన వివరాలు ముద్రించిన ప్రభుత్వం భక్తుల ఆగ్రహాన్ని చవిచూసిందన విషయాన్ని గుర్తుచేశారు.

READ MORE  వైసిపి నేతలు గుడ్డలూడదీయడంలో మంచి అనుభవజ్ఞులు...: కాలవ షాకింగ్ కామెంట్స్

గతంలో ఆలయ అర్చకులుగా పనిచేస్తూ, తప్పుడు ఆరోపణలు చేసిన రమణదీక్షితుల్ని టీడీపీ ప్రభుత్వం తొలగిస్తే,  తిరిగి ఆయన్ని తిరుమలలో ప్రధానార్చకులుగా, ఆగమ సలహామండలి సభ్యులుగా ప్రభుత్వం నియమించిందన్నారు. స్వామివారి నగలు మాయమయ్యాయని, పింక్‌ డైమండ్‌ మాయమైందని, దాన్ని రూ.700కోట్లకు అమ్మేశారని, పోటువిభాగం కింద తవ్వకాలు జరిపారని, నేలమాళిగల్లో దొరికిన వజ్రవైఢూర్యాలను చంద్రబాబు ఇంటికి తరలించారని, స్వామివారి అంతరాలయంపై ఇష్టానుసారం గతంలో ఆరోపణలు చేసిన రమణదీక్షితులుపై తానే పరువునష్టం దావావేసినట్లు  ఉమా తెలిపారు. 

కోటానుకోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి, వేంకటేశ్వరస్వామి ఆలయపవిత్రతకు భంగంకలిగేలా వ్యవహరించిన రమణదీక్షితుల్ని తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారని బొండా నిలదీశారు. హిందూ ఆలయాల పవిత్రతను, విశిష్టతను దెబ్బతీసేలా రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 

టీటీడీ అదనపుఅధికారిగాఉన్న దర్మారెడ్డి స్వామివారి నగల వివరాలు వెల్లడించినప్పుడు ఎక్కడా పింక్‌డైమండ్‌ ప్రస్తావనలేదని, దాన్నిబట్టే రమణదీక్షితులు చెప్పినవన్నీ అవాస్తవాలేనని రుజువైందన్నారు. శ్రీశైలక్షేత్రంలో కూడా ఇతరమతాలకు చెందినవారిని ప్రచారం చేసుకునేందుకు అనుమతించారని, దానిపై హిందూసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేయడంతో ప్రభుత్వం వెనక్కుతగ్గిందన్నారు.

READ MORE  ఇక రంగంలోకి ఏసిబి...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు....: జగన్ హెచ్చరిక

తాజాగా అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయంలో సాయంత్రంవేళ జరిగే భజన కార్యక్రమంలో క్రైస్తవగీతాలు పాడటం జరిగిందని, ప్రభుత్వం బుద్ధిలేకుండా ఇలాంటి పనులు చేయడం ద్వారా మతాలు, కులాలమధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందన్నారు. అన్నవరంలో జరిగిన ఘటనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదుచేస్తే, కొందరు వ్యక్తులు కక్షతో ఆలయఅధికారిపై దాడికి పాల్పడటం జరిగిందన్నారు.

ఎవరిమతాలు, ఎవరినమ్మకాలు వారికి ఉంటాయని, వాటిని అపహస్యంచేసేలా ఎవరు ప్రవర్తించినా అది సభ్యసమాజానికి మంచిదికాదని బొండా సూచించారు. గతంలో తెలుగుదేశం పాలనలో టీటీడీపై, స్వామివారినగలపై విషప్రచారం చేసిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఆనాడుచేసిన ఆరోపణలను ఎందుకు నిరూపించలేకపోయిందని ఆయన నిలదీశారు.        
 
 
 

click me!