ఏపి సీఎస్ నీలం సహానికీ ఇబ్బందులు తప్పవు...: వర్ల రామయ్య హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Feb 4, 2020, 9:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని అతిత్వరలో పెద్ద ఇబ్బందులను ఎదుర్కోనున్నారని తెెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య హెచ్చరించారు. 


అమరావతి: జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యిందని... ఆయన కక్షపూరిత చర్యలు చూస్తుంటే పాలెగాళ్ల పరిపాలన గుర్తుకొస్తుందని టీడీపీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య మండిపడ్డారు. ఇష్టమైనవాళ్లను అందల మెక్కించడం, ఇష్టంలేని వాళ్లను కాళ్లకిందేసి తొక్కేయడమనే సిద్ధాంతాన్ని ముఖ్య మంత్రి తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడని ఆరోపించారు. 

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 43మంది డిఎస్పీలను వీఆర్‌లో ఉంచిందని, వారిలో ఎక్కువమంది ఒకే సామాజికవర్గానికి చెందినవారని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఏ కారణం లేకుండా వారిని వీఆర్‌లో ఉంచి జీతభత్యాలు కూడా ఇవ్వడం లేదన్నారు. 

Latest Videos

అలానే ఏడుగురు అడిషనల్‌ ఎస్పీలు, 100మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, మరో వందమంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వీఆర్‌లో ఉన్నారని రామయ్య పేర్కొన్నారు. వీరంతా చేసిన తప్పేమిటో... వారికి జీతభత్యాలు ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారో జగన్‌ చెప్పాలన్నారు.

గత ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో పనిచేశారన్న అక్కసుతోనే 43మంది డీఎస్పీలను రిజర్వ్‌లో ఉంచడం జరిగిందన్నారు. శాంతి భద్రతలు కాపాడేవారిపై సామాజికవర్గ ముద్రవేయడం ఎంతవరకు సబబో జగనే చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘోరం లేదని... దీనిపై స్పందించాల్సిన పోలీస్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎక్కడ నిద్రపోతున్నారని రామయ్య నిలదీశారు. 

read more  అమరావతి విషయంలో జోక్యం చేసుకుంటారా...?: కేశినేని ప్రశ్నపై కేంద్రం స్పష్టత

ప్రతిపక్షంపై మీసాలు తిప్పి, తొడలుకొట్టిన పోలీస్‌ అసోసియేషన్‌ సభ్యులు వీఆర్‌లో ఉంచిన సహచర సభ్యుల విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడటానికి ఎందుకు సంకోచిస్తున్నారన్నారు. గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్లు కూడా ఈ అంశంపై స్పందించాలన్నారు. అటు ఉద్యోగాలు లేక, ఇటు జీతాలు రాక కుటుంబాలు గడవడం భారమై వారంతా అప్పులు చేసి తమ బతుకులు వెళ్లదీస్తుంటే పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఈ విషయం ఢిల్లీ వరకు వెళ్లకముందే రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి జగన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని... వారందరికీ తక్షణమే పోస్టింగ్స్‌ ఇవ్వాలని రామయ్య డిమాండ్‌ చేశారు. 

మూడేళ్లైనా ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు లేవని... తెలంగాణలో ఉండే సిబ్బందికి ఎప్పుడో ప్రమోషన్లు వచ్చాయి కానీ ఏపీలో మాత్రం ఇంతవరకు ఆ ఊసేలేదన్నారు. ఏపీఎస్పీలో పనిచేసే సిబ్బంది పదోన్నతుల విషయంపై కూడా డీజీపీ, సీఎం జగన్‌ దృష్టిసారించాలన్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం తన సామాన్లు తనే మోసుకుంటున్నాడు...

గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేసి జగన్‌తో అన్నా అన్నా అని పిలిపించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఎక్కడున్నాడో, ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలన్నారు. ఎల్వీఎస్‌ లాంటి వ్యక్తి చివరకు అటెండర్‌లా తన సామాన్లు తానే మోసుకుంటూ దిగజారడానికి ఎవరు కారణమో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు అందరూ గుర్తించాలన్నారు. అధికారుల్ని జైలుకి తీసుకెళ్లే అలవాటున్న వ్యక్తి కింద పనిచేస్తున్న అధికార యంత్రాంగం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మసలుకుంటే మంచిదని వర్ల హితవుపలికారు. 

శ్రీలక్ష్మి, ఆచార్య, రాజగోపాల్‌, మంత్రులు ధర్మాన, మోపిదేవి, సబితా ఇంద్రారెడ్డి లాంటివాళ్లను చూసినప్పటికీ వైఖరి మారకపోతే ఎలా  అని టీడీపీనేత ప్రశ్నించారు. ఇప్పుడు చీఫ్‌సెక్రటరీగా ఉన్న నీలం సహానీ కూడా త్వరలోనే ఇబ్బందుల్లో పడతారని, కోర్టుచెప్పినా వినకుండా పరిపాలనా యంత్రాంగాన్ని తరలిస్తూ ఆదేశాలు ఇవ్వడమే ఆమె చేసిన తప్పిదమన్నారు. 

read more  ఆ మంత్రులూ దద్దమ్మలేనా...? జబర్దస్త్‌ పంచులు పనిచేయవు...: రోజాకు సంధ్యారాణి చురకలు

ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా, అధికారులు శాశ్వతమనే విషయాన్ని ఐఏఎస్‌ లు, ఐపీఎస్‌లు ఎందుకు తెలుసుకోవడం లేదన్నారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయం పొందినవారంతా, జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, దీన్నే క్విడ్‌ప్రోకో అంటారని కోర్టులు స్పష్టంచేశాయని, ఇంతచిన్న విషయంకూడా తెలియనివారే జగన్‌పై ఉన్న కేసులు ప్రూవ్‌ అవ్వలేదని చెప్పుకుంటున్నారని రామయ్య మండిపడ్డారు. కోర్టులు విచారించి, దోషులకు శిక్షలు వేసేవరకు నమ్మని వారికి ఏంచెప్పినా తలకెక్కదన్నారు. పరిధిదాటి ప్రవర్తించే అధికారులందరికీ ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని రామయ్య స్పష్టం చేశారు.      

click me!