సాక్షిలో నా వార్తలు రావు, కులమే అడ్డమా: వైఎస్ భారతికి వర్ల రామయ్య ప్రశ్న

By Arun Kumar P  |  First Published Feb 17, 2020, 3:40 PM IST

తెలుగుదేశం పార్టీపై, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణీ వైఎస్ భారతి సారథ్యంలోని మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేయడంపై టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  


గుంటూరు: ఇటీవల మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  మాజీ పీఎస్ పై  ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో చంద్రబాబు సంబంధించిన దాదాపు రూ.2వేల కోట్లను అధికారులు గుర్తించినట్లు వైసిపి అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదేక్రమంలో ఐటీ శాఖ విడుదలచేసిన ఓ ప్రకటన గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి నిర్వహణలోని ఓ మీడియా సంస్థ కూడా కొన్ని వార్తలు ప్రచురించింది. వీటిని ప్రస్తావిస్తూ టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య సీఎం సతీమణికి ఓ బహిరంగ లేఖ రాశారు. 

వర్ల రామయ్య బహిరంగ లేఖ యధావిధిగా..

Latest Videos

undefined

గౌ|| శ్రీమతి భారతి రెడ్డి గారు,

జగతి పబ్లికేషన్స్‌,
హైదరాబాద్‌.

విషయం : పత్రికా విలువలను దిగజారుస్తున్న సాక్షి పత్రిక కథనాల గురించి... రాష్ట్రంలో వార్తా పత్రికల విలువల వలువులను సాక్షి పత్రిక ఊడదీస్తున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఫోర్త్‌ ఎస్టేట్ గా సమాజంలో విలువైన స్థానంలో ఉండావాల్సిన మీ పత్రిక ఒక రాజకీయ పార్టీకి కరపత్రికగా ఉపయోగపడటం దురదృష్టకరం. 

గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. ఒక సారి పార్లమెంటుకు పోటీ చేశాను. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. గత 11 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. ప్రసుత్తం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్రియాశీలక పోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరపున పత్రికా సమావేశాలు అత్యధికంగా నిర్వహించే అతికొద్ది మంది అధికార ప్రతినిధుల్లో నేనూ ఒకడిని. నా పత్రికా సమావేశాలను ఎలక్ట్రానిక్‌, పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తారు. 

కానీ దురదృష్టం ఏమిటంటే.. సాక్షి పత్రిక పుట్టిన నాటి నుండి ఏ ఒక్క రోజు కూడా నా వార్తలను గానీ, నా పత్రికా సమావేశం వివరాలను గానీ, ప్రసారం చేసినట్లు, ప్రచురించినట్లు ఎటువంటి దాఖలాల్లేవు. దీనికి ప్రత్యేమైన కారణం ఏమైనా ఉన్నదా.? మీ పత్రికలో నా వార్తలు ప్రచురించకపోవడానికి, మీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడానికి నాపై ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.? లేక నా కులమే మీకు అడ్డొస్తున్నదా.? నాకు తెలిసి పత్రికా రంగంలో కులాలకు ప్రాధాన్యం ఇస్తారని అనుకోవడం లేదు. 

సాక్షి పత్రిక, ఛానల్‌ ప్రారంభించింది వైసీపీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌ రెడ్డి గారని, దానిని ప్రస్తుతం కొనసాగిస్తున్నది మీరు అని రాష్ట్ర ప్రజలందరికీ విధితమే. ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన నాయకుడి గొంతుకను మీరు ఈ విధంగా నొక్కితొక్కేయడం సబబా.. అని గౌరవ ప్రదంగా మిమ్ములను అడుగుతున్నా. 

మీ పత్రిక నేను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం పాత్రికేయ విలువలు పాటించినట్లేనా.? మాజీ పీఎస్‌ శ్రీనివాసరావుపై ఐటీ సోదాలకు సంబంధించి.. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశ వ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, రూ.2వేల కోట్లు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. కానీ.. ఆ సొమ్ము మొత్తం కూడా పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు, ఆ బురదను చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం.? ఇది అబద్దపు వార్తలను ప్రచురించడం కాదా.? 

ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో మరో రాజకీయ పార్టీపై బురద జల్లడం భావ్యమా.? నిన్న ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రూ.2.63 లక్షల నగదు, కుమార్తెకు చెందిన కొన్ని బంగారు ఆభరణాలు పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఉన్నట్లు, వాటి రికార్డులు సక్రమంగా ఉండడంతో తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేశారు. కానీ సాక్షి పత్రికలో గానీ, ఛానల్‌లో గానీ కనీసం ఒక్క నిమిషం కూడా ప్రసారం చేయలేదు. ఇది మీ మీడియా ద్వారా మీడియా విలువలను దిగజార్చడం కాదా.? ఇలా తప్పుడు వార్తలు రాయడం పత్రికా విలువలకు విరుద్ధమని మీకు తెలుసా.? 

అత్యున్నతమైన మీడియాను ఇలా దిగజార్చడం మీకు సరికాదు. ఇప్పికైనా ఎందరో మహానుభావులు ప్రధాన పాత్ర పోషించిన పత్రికా రంగ నిర్వహణ ఇప్పుడు మీరు కూడా పోషిస్తున్నారు కనుక.. ఆ మహానుభావులు కాపాడిన నైతిక విలువల వలువలు ఊడ్చకండని తెలియజేస్తున్నాను.                                

(వర్ల రామయ్య)                                        
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు

click me!