గుంటూరు ఎంపీ నందిగం సురేష్ పై తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఆయన కేేవలం దళితుల ఓట్లతోనే ఎంపీ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
గుంటూరు: టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన పథకానికే పేరుమార్చి నాడు-నేడు పేరుతో జగన్ అమలు చేస్తున్నాడని... గత ప్రభుత్వం ఏవిధమైన నిబంధనలు లేకుండా చదువుకునే ప్రతివిద్యార్థికి న్యాయంచేస్తే వైసీపీ సర్కారు అడ్డమైన నిబంధనలన్నీ తెరమీదకు తెచ్చి అర్హులైన వారికి తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ మహిళానేత, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.
మంగళవారం ఆమె మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేదవిద్యార్థుల చదువుకయ్యే ఖర్చు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందని, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులతో పాటు మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీల కింద ప్రతి విద్యార్థికి ఏటా రూ.20వేలు చెలిస్తానని జగన్ చెప్పడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చాక తనహామీని తానే మర్చిపోయిన జగన్ నాడు-నేడు, జగనన్న వసతి దీవెన పేరుతో గత ప్రభుత్వం అమలుచేసిన పథకాన్నే రూపురేఖలు మార్చి సరికొత్త కోతలతో అమల్లోకి తెచ్చిందని అనిత ఎద్దేవాచేశారు.
read more విశాఖలోనే రాజధాని ఎందుకంటే...: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందానికి జగన్ వివరణ
చంద్రబాబు నాయుడు ఏవిధమైన నిబంధనలు, ఆంక్షలు లేకుండా ఐటీఐ మొదలు, వివిధరకాల వృత్తి విద్యాకోర్సులు చదివే విద్యార్థులందరికీ ఏటా రూ.19వేల చొప్పున క్రమంతప్పకుండా 19లక్షలమందికి చెల్లించడం జరిగిందన్నారు. జగన్ అదే పథకాన్ని పేరు మార్చి అమల్లోకి తీసుకొచ్చి చదువుకునే ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తానని చెప్పి విద్యార్థుల సంఖ్యను 11 లక్షలకు కుదించాడని... దానికితోడు అర్థంపర్థంలేని నిబంధనలన్నీ అమలుచేస్తున్నాడని అనిత దుయ్యబట్టారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చదువుకునే ప్రతివిద్యార్థికి ఏటా రూ.20వేలు అందిస్తానని చెప్పిన జగన్ ఆ మొత్తాన్ని ఈఏడాది రూ.10వేలకే పరిమితం చేశాడని, అదికూడా వాలంటీర్లు కార్డులు ఇచ్చాకే ఆ మొత్తం విద్యార్థులకు చేరుతుందని చెప్పడం దారుణమన్నారు. మిగిలిన రూ.10వేలను వచ్చే విద్యాసంవత్సరంలో ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబని వంగలపూడి ప్రశ్నించారు.
అమ్మ ఒడి కింద విద్యార్థుల సంఖ్యను కుదించిన జగన్ సర్కారు అదే నిబంధనను వసతిదీవెనకు కూడా వర్తింపచేసిందని, అమ్మ ఒడి కింద కుటుంబంలోని ఒకవిద్యార్థికి లబ్ది కలిగితే పైచదువులు చదివేవారు ఆ ఇంట్లో ఉన్నాకూడా వారికి దాన్ని వర్తింపచేయడంలేదన్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన వసతిదీవెన పథకం అమలుకు కూడా అమ్మ ఒడి మాదిరిగానే అనేక కొర్రీలు పెట్టారని అనిత తెలిపారు. 200 యూనిట్ల కరెంట్ వాడినా, 75శాతం హాజరు లేకపోయినా, కార్లు, బైకులు ఉన్నా, పథకాన్ని వర్తింపచేయబోమని చెప్పడం జగన్ లాంటి తెలివిగలవారికే చెల్లిందన్నారు.
వీటికితోడు గత ప్రభుత్వం అమలుచేసిన భోజనం మెనూని మార్చేసి, ఇంటర్ విద్యార్థులకు అమలుచేసిన మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా జగన్ నిలిపివేశాడన్నారు. అలానే బీసీ విద్యార్థులతోపాటు, ఈబీసీ కింద కాపు విద్యార్థులకు కూడా టీడీపీ ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలుచేస్తే, జగన్ దాన్ని కూడా అటకెక్కించాడన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు ఇతర వృత్తివిద్యాకోర్సులు, విదేశాల్లో చదివేవారికి, సివిల్స్ , గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి జగన్ మొండిచెయ్యి చూపారని అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎంపీ సురేశ్ కు సిగ్గుందా...
మహిళలపై ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టించడమే కాకుండా, ఇష్టమొచ్చినట్లుగా వారిని దూషించిన ఎంపీ సురేశ్ కు సిగ్గులేదన్నారు. పదేపదే దళితుడని చెప్పుకునే సురేశ్ కు అందరూ ఓటేశారని.. కేవలం ఆయన దళితులు ఓట్లేస్తేనే ఎంపీగా గెలవలేదన్నారు. తాను అందరికీ ఎంపీననే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. మహిళలు జై అమరావతి అనమంటే ఆయన ఎందుకంతలా ఆవేశానికి గురయ్యారో తెలియడంలేదన్నారు. తానే మహిళలని దూషించి, తిరిగివారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రజల్లోకి వచ్చే ధైర్యం వైసీపీ ప్రజాప్రతినిధులకు లేనప్పుడు, వారిమధ్యకు రావడం మానేస్తే మంచిదన్నారు. దిశచట్టం నందిగం సురేశ్ తోపాటు, జగన్ పై కూడా మోపాలన్నారు.
read more వసంత కుంటుబానివి హత్యా రాజకీయాలు...ఈ రెండింటి వెనక...: దేవినేని ఉమ
చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే నోరెత్తలేని వైసీపీమహిళానేతలు అయినదానికి, కానీదానికి నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని అనిత మండిపడ్డారు. కడుపు మండితేనే మహిళలు రోడ్లపైకి వస్తారని, వారు గడపదాటిన తొలిరోజునే వారి సమస్యను పరష్కరించడానికి ప్రయత్నించే ఉంటే, సమస్య ఇంతదూరం వరకు వచ్చి ఉండేది కాదని అనిత సూచించారు.
వైసీపీ ప్రజాప్రతినిధులకు దమ్ము,ధైర్యముంటే భద్రత లేకుండా రాజధాని ప్రజల ముందుకు రావాలన్నారు. జేఏసీ మహిళలకు జరిగిన దారుణంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధమయ్యామని అనిత తెలిపారు. డీజీపీకి ఫిర్యాదుచేసినా పెద్దగా ఉపయోగం ఉండదన్నారు.
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించి రాజశేఖర్ రెడ్డి 26 విచారణలు వేశారని, జగన్ ఏం చేస్తాడని అనిత ప్రశ్నించారు. సిట్ వేసిన తీరుపైనే అనేక సందేహాలున్నాయని, డీఐజీ,డీజీపీ స్థాయి వ్యక్తులు ఐఏఎస్ లను, ఇతర ప్రధానాధికారులను ఎలా విచారిస్తారన్నారు. సొంత బాబాయి హత్యకేసు విచారణపై జగన్ సిట్ వేశాడని, దానిని ఆయన సోదరే నమ్మలేదని, ఆమెకే జగన్ పై నమ్మకంలేకపోతే, ప్రజలకు ఎక్కడనుంచి వస్తుందని అనిత ప్రశ్నించారు.