టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి ఇసుక దీక్షకు వ్యతిరేకంగా తాను కూడా దీక్ష చేపట్టనున్నట్లు వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అతడిపై టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు.
అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు పోటీగా మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి దీక్షకు పిలుపునిచ్చారని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. నిజాలు మాట్లాడినందుకు ఆయన ఎందుకంత ఉలిక్కిపాటుకు గురవుతున్నారో అర్థం కావడం లేదని... ఆయనకు ఇసుక మాఫియాతో సంబంధాలున్నాయన్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా అంటూ పార్థసారధికి అనురాధ సవాల్ విసిరారు.
తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ఆయన దీక్షకు కూర్చుకోవాలని అన్నారు. కేవలం ప్రతిపక్షనేత దీక్షకు పోటీ దీక్షను భగ్నం చేయాలన్న వైసిపి కుట్రలో భాగంగానే ఈ కుతంత్రం జరిగిందన్నారు.
ఎమ్మెల్యే పార్థసారధికి అనురాధ సంధించిన ప్రశ్నలివే...
''1. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం మద్దూరు గ్రామంలో ఇసుక రీచ్‌ల టెండర్ ఓపెన్ చేయడంలో జరిగిన జాప్యానికి మీ ప్రమేయం లేదా?
2. పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు మీ సన్నిహితులు కాదా? తోట్ల వల్లూరు మండలం రొయ్యూరు ఇసుక రీచ్‌లో అక్రమ మైనింగ్ జరగలేదా? జరిమానాలు కొందరికి స్వల్ప మెత్తంలో విధించలేదా?
5-11-2019 తేదీన ప్రజలు అక్రమ ఇసుకతో వున్న 4 లారీలను ఆపి సిఐ, ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లినా తగు చర్యలు తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిడిలు కారణం కాదా? ఈ విషయాన్ని ప్రజలు, అఖిలపక్ష నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయటం వాస్తవం కాదా? మీ సన్నిహితుని నియోజకవర్గాలలోని ఇసుక రీచ్‌లలో జరిగే అక్రమ ఇసుక దందా రాజకీయ ప్రమేయం లేకుండానే జరుగుతుందా? ఇక్కడ అక్రమ ఇసుక రవాణాపై మీరు పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేశారు?
3. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో భూ కబ్జాకు పాల్పడినందుకు మీ(పార్దసారధి) కుమారుడు నితిన్ కృష్ణపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 420, 441, 447, 465, 474, 208, 210 సెక్షన్ల కింద కేసులు నమోదు అయింది వాస్తవం కాదా?
4. కేపీఆర్ టెలిప్రోడక్ట్స్ ఎండీగా ఉన్న కాలంలో యంత్రాలు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా మోసం చేసినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈడీ ఫెరా చట్టం కింద నోటిసిలిచ్చింది వాస్తవం కాదా? ఆ నోటీసులకు స్పందించకుండా ఉల్లఘించినందున కోర్టు విచారించి రెండు నెలలు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించటం వాస్తవం కాదా?
5. ఫెరా చట్టం ఉల్లంఘన కేసులో మీ కంపనీకి రూ. 5 లక్షలు జరిమానా విధించారు, కేసులు ఉన్న విషయంలో పొందుపర్చటం చట్ట ఉల్లంఘన కాదా?'' అంటూ పార్థసారధిపైకి ప్రశ్నలను సందించారు పంచుమర్తి అనురాధ
.