ఏపి సీఎం జగన్ పై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు ప్రజలు, వ్యాపారుల నుండి జె ట్యాక్స్ వసూలు చేయగా తాజాగా ప్రజాప్రతినిధుల నుండి కూడా దాన్ని వసూలు చేయడం ప్రారంభించారని ఆరోపించారు.
కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటి అయ్యారు. బుధవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం గాజులపల్లిలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అన్నవరంలో, కృష్ణా జిల్లా చందర్లపాడు మండలాల్లో చేసిన పనులకు బిల్లులు రాక ముగ్గురు నాయకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు.
ఈ ఆత్మహత్యలకు వైసిపి ప్రభుత్వమే కారణమన్నారు. అందుకు బాధ్యత వహిస్తూ సీఎం జగన్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇకపై ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని... ధైర్యంగా పోరాడాలే తప్ప ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. న్యాయస్థానాల ద్వారా పోరాడదామని సూచించారు.
చేసిన పనులకు డబ్బులు వచ్చేదాకా టిడిపి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామాల మీద అభిమానంతో చిత్తశుద్దితో, సేవాభావంతో పనిచేసిన మిమ్మల్ని ఇలా ఇబ్బందులపాలు చేయడం ప్రభుత్వానికి తగదన్నారు.
సొంతూళ్లలో వసతులు పెంచాలనే సదుద్దేశంతో మీరంతా పనులు చేశారని ప్రశంసించారు. ఊరు బాగుపడితే మంచిపేరు వస్తుందని అనేక పనులు చేశారన్నారు.అలా
చట్ట ప్రకారం చేసిన పనుల బకాయిలు చెల్లింపుకు మీరంతా డిమాండ్ చేస్తుంటూ వైసిపి ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.
మన పొలంలో మనం మట్టి తీసుకువెళ్లాలన్నా జగన్ ట్యాక్స్(జె ట్యాక్స్) కట్టాలనడం తగదన్నారు. ఇది నేరస్తుల ప్రభుత్వంగా మారిందన్నారు. ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని... దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
పని చేసిన మాట వాస్తవం, చేసిన పనులు కళ్లెదుటే కనిపించడం వాస్తవం, ఎఫ్‌టివో(ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్) వాస్తవం, సోషల్ ఆడిట్ వాస్తవమన్నారు. కాబట్టి చేసిన పనులకు చెల్లింపులు పొందే హక్కు మీకు ఉందన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్ని దగ్గర ఉంచుకోవాలని....న్యాయస్థానాల్లో పోరాడేందుకు సిద్దం కావాలని సూచించారు.
దేశానికే ఆదర్శంగా నరేగా పనులు చేశామని తెలిపారు. మనం తవ్విన పంటకుంటల్లో నిండుగా నిలబడ్డ నీళ్లే నరేగా సత్ఫలితాలకు రుజువని తెలిపారు. గత ఏడాది రూ.9,300కోట్ల విలువైన పనులు చేశామని... 5ఏళ్లలో నరేగా నిధులు రూ.32వేల కోట్లు సద్వినియోగం చేసుకున్నామన్నారు. కన్వర్జెన్స్ ద్వారా గ్రామాల్లో శాశ్వత ఆస్తులు కల్పించామని వెల్లడించారు.
గత 5ఏళ్లలో 26వేల కి.మీ సిమెంట్ రోడ్లు, 6వేల అంగన్ వాడి భవనాలు, 2,200 పంచాయితీ భవనాల నిర్మాణం, ఘన వ్యర్ధాల నిర్వహణా కేంద్రాలు 10,000, గ్రామాల్లో 12వేల కి.మీ దూరం కనెక్టివిటి పెంచడం, 7లక్షల పైగా పంటకుంటల తవ్వకం, స్మశానాలు, క్రీడాస్థలాల అభివృద్ధితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు.
ఈ 5నెలల్లో వైసిపి ప్రభుత్వం తట్ట మట్టి వేయలేదు, ఒక్క ఇటుక పెట్టలేదని ఎద్దేవా చేశారు. నరేగా నిధులు రాష్ట్రం అంతా నిలిపేసి, ఒక్క పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాలకే విడుదల చేశారన్నారు. టిడిపి హయాంలో వైసిపి ఎంపిలే తప్పుడు ఫిర్యాదులు పంపి నిధులు అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు.
రైతుకు ఏడాదికి ఇచ్చేది కేవలం రూ.6,500మాత్రమేనని...అదే గ్రామ వాలంటీర్ల పేరుతో వైసిపి కార్యకర్తలకు నెలకు రూ.8వేలు దోచి పెడుతున్నారని ఆరోపించారు. పనులు చేసినవాళ్లకు డబ్బులు ఎగ్గొట్టి వైసిపి కార్యకర్తలకు మాత్రం వేలకోట్లు దోచిపెడుతున్నారన్నారు.