ఎన్జీ రంగా వర్సిటీ వీసి అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర: ఎమ్మెల్సీ అశోక్ బాబు

By Arun Kumar PFirst Published Oct 21, 2019, 5:31 PM IST
Highlights

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటి వైస్ చాన్సలర్ అరెస్ట్ పై టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. ఈ అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగివుందని ఆయన ఆరోపించారు.  

గుంటూరు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసిని పోలీసులు అరెస్టు చేయటం దారుణమని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఇది వైఎస్సార్‌సిపి ప్రభుత్వం కావాలని చేసిన కుట్రగానే తాము భావిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. 

వైస్ చాన్సలర్ గా యూనివర్సిటీ నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన ఆయన ఎన్నో సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి దామోదర నాయుడు అని అభివర్ణించారు. తన కింద పనిచేసే అటెండర్ స్థాయి వ్యక్తిని కులం పేరుతో తిట్టాల్సిన అవసరం వీసీకి ఏముంటుందని అన్నారు. 

టిడిపి ప్రభుత్వ హయాంలో నియమితులైన వారిని ఈ ప్రభుత్వం ఏదో ఒకవిదంగా వేధిస్తున్నారని అన్నారు. యూనివర్సిటీలో అధికార పార్టీ నేతలు సూచించిన వారికి పోస్టులు ఇవ్వలేదనే వీసీ పైన అక్రమ కేసులు బసాయించారని అశోక్ బాబు ఆరోపించారు. 

రాష్ట్రంలో పొరుగుసేవల సిబ్బందిని తొలగించాలని జీవో ఇవ్వడం కూడా సరికాదన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా లేకుండా సాక్షి ఉద్యోగులను ప్రభుత్వంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బలవంతంగా రాష్ట్రంలోని అందరు వీసీలను తొలగించే ప్రయత్నంలో భాగమన్నారు. ఇది వ్యక్తి పై జరిగిన దాడి  కాదని వ్యవస్థ పై జరిగిన దాడి అని అన్నారు.

ఆదివారం తుళ్లూరు పోలీసులు ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్ నాయుడిని అరెస్ట్ చేశారు.  ఎస్టీ కులానికి చెందిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించి... ఉద్యోగంలో నుంచి తీసేశారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3తోపాటు ఐపీసీ 506 కింద ఆయనను అరెస్టు చేశారు.

 చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నంకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016లో ఎన్జీ రంగా వర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండర్‌గా చేరాడు. అతడిని ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తనను ఉద్యోగంలో పెట్టుకోవాలని కోరుతూ వచ్చిన మురళీకృష్ణ గత నెల 23న సచివాలయంలో వీసీ, రిజిస్ట్రార్‌ ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి తనను ఉద్యోగంలో చేర్చుకోవాల్సిందిగా మరోసారి ప్రాధేయపడ్డాడు.

అయితే... అతని అభ్యర్థనను వీసీ పట్టించుకోలేదు. అంతేకాకుండా... ఇంకోసారి ఇలా కాలేజీకి వస్తే..  అంతు చూస్తానని బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతన్ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

click me!