వైసిపి అధికారంలోకి వచ్చాక కాదు రాకముందే...: జగన్ పై కాలవ ఫైర్

By Arun Kumar P  |  First Published Feb 3, 2020, 11:30 PM IST

 జగన్‌ సర్కారు ప్రతిపక్ష పార్టీలపైనే కాదు రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలపై కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని టిడిపి నాయకులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. 


గుంటూరు: బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని సమాధిచేసిన జగన్‌ సర్కారు ఆయా వర్గాలను బలిపీఠంపైకి ఎక్కించిందని... సొంతకాళ్లపై నిలబడి మనుగడ సాగించేలా వారికి అవసరమైన ఆర్థిక చేయూతను అందించకుండా అన్నమో రామచంద్రా అనేస్థితికి దిగజార్చిందని టీడీపీ  సీనియర్‌ నేత, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. 

సోమవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌ సర్కారు బడుగు, బలహీనవర్గాలపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆయన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందాల్సిన పింఛన్లలో భారీకోత విధించిందన్నారు. ఎన్నికల వేళ 45ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ,ఎస్సీ, మహిళలకు,  45ఏళ్లు పైబడిన చేనేత  మహిళలకు పింఛన్లు ఇస్తానన్న జగన్‌ తరువాత అనకాపల్లి సభలో మేనిఫెస్టోలో లేదంటూ ఆ నిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అధికారంలోకి రాకముందే మాటతప్పాడన్నారు. 

Latest Videos

undefined

నిన్నటికి నిన్న పంపిణీచేసిన పింఛన్లలోకూడా రాష్ట్ర ప్రభుత్వం భారీగాకోతపెట్టిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 54లక్షల 14వేల 592మందికి పింఛన్లు పంపిణీ  చేస్తే, జగన్‌ సర్కారు జనవరిలో వాటిని 48లక్షలకే పరిమితం చేసిందన్నారు. పింఛన్‌దారుల వయస్సుని 65 నుంచి 60ఏళ్లకు తగ్గించినప్పుడు నిజంగా  అర్హులసంఖ్య పెరగాలన్నారు.

అలానే  టీడీపీ ప్రభుత్వం అనంతపురంలో అమలుచేసిన 10ఎకరాల  మెట్టభూమి ఉన్న రైతులకు ఇచ్చే పింఛన్‌ని తాను అధికారం లోకొస్తే, రాష్ట్రమంతా అమలు  చేస్తానని చెప్పిన జగన్‌ ఇప్పుడు దాని ఊసే ఎత్తడంలేదన్నారు. 60ఏళ్ల నిబంధనను అమలుచేస్తే ప్రభుత్వ లెక్కలప్రకారమే పింఛన్‌కు అర్హులైనవారు 6లక్షలమంది ఉంటారని, ఆ సంఖ్య అదనంగా పింఛన్ల జాబితాకు ఎందుకు జతకాలేదని మాజీమంత్రి నిలదీశారు. 

అదేవిధంగా 10ఎకరాల మెట్టభూమి నిబంధనను అమలు పరిచిఉంటే దాని ప్రకారం పింఛన్‌దారుల సంఖ్య మరో 6లక్షలమంది ఉండేవారన్నారు. 01-01-2020నాటికి 53లక్షలమందికి మాత్రమే జగన్‌సర్కారు పింఛన్లు ఇచ్చి లక్షపింఛన్లను కోసేసిందన్నారు. ఫిబ్రవరి జాబితాను పరిశీలిస్తే పాతవి 48లక్షల   57వేలుంటే కొత్తగా వైసీపీపాలనలో 6లక్షల11వేల పింఛన్లను జతచేయడం జరిగిందన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో 54లక్షలుగా ఉన్న పింఛన్‌దారుల సంఖ్య వైసీపీవచ్చాక 48.57లక్షలకు ఎలా తగ్గిందో చెప్పాలని... అలానే 60ఏళ్ల నిబంధన ప్రకారం అర్హులైన వారు, 10ఎకరాల మెట్టభూమి నిబంధన దృష్ట్యా అదనంగా కూడవలిసిన పింఛన్‌దారుల సంఖ్య ఎలా తగ్గిందో... దానిలోని మతలబు ఏమిటో జగన్‌ చెప్పాలని కాలవ డిమాండ్‌ చేశారు. 

వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీచేయడం తనకెంతో గర్వకారణంగా ఉందని చెబుతున్న సీఎం, నిబంధనలపేరుతో పింఛన్లలో భారీగా కోతవిధించాడన్నారు. 300యూనిట్లు విద్యుత్‌వాడకం దాటినా, ఆధార్‌ అనుసంధానం లేకపోయినా, రేషన్‌కార్డు లో వయసులో తప్పులున్నాయని, ఒకే రేషన్‌కార్డులోని సభ్యుల్లో ఒక్కరికే పింఛన్‌ ఇస్తామనే నిబంధనలు సాకుగా చూపి, ప్రభుత్వం చాలామంది అర్హుల నోట్లో మట్టిగొట్టిందన్నారు. 

ప్రభుత్వ తప్పులు, సాంకేతిక కారణాలవల్ల అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు న్యాయం జరగలేదన్నారు. పింఛన్లపై ఆధారపడి బతికేవారందరికీ జగన్‌ ఏం సమాధానం చెబుతాడని కాలవ నిలదీశారు. వాలంటీర్లు తమ అనుకున్నవారికే పింఛన్లు మంజూరు చేశారని, రాజకీయకారణాలు, వ్యక్తిగత విబేధాల కారణంగా పింఛన్ల పంపిణీలో అనేక అవతవకలు జరిగాయన్నారు.

బడుగు, బలహీనవర్గాల సంక్షేమనిధులు అమ్మఒడికి....

టీడీపీప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల వారి ఆర్థిక స్వావలంబన కోసం అనేకవిధాలుగా చేయూతనందిస్తే, జగన్‌ సర్కారు ఆయావర్గాలవారు 'అన్నమో రామచంద్రా' అనేస్థితిని కల్పించిందని కాలవ మండిపడ్డారు. ఆయావర్గాలకు సబ్సిడీ రుణాలు, పనిముట్లు  అందించకుండా, ఆర్థికసహాకార సంస్థల కార్యక్రమాలను జగన్‌ప్రభుత్వం పూర్తిగా స్తంభింపచేసిందన్నారు.  

బీసీ కార్పొరేషన్‌ నుంచి రూ.3432 కోట్లను, కాపుకార్పొరేషన్‌ నుంచి రూ.568కోట్లను, మైనారిటీ కార్పొరేషన్‌నుంచి రూ.442కోట్లను, ఎస్టీ కార్పొరేషన్‌నుంచి రూ.395 కోట్లను, ఎస్సీ కార్పొరేషన్‌నుంచి రూ.1271కోట్లను, మొత్త 6,108కోట్లను అమ్మఒడికి మళ్లించారని కాలవ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమనిధుల్ని అమ్మఒడి పథకానికి మళ్లించడం ద్వారా ఆయా వర్గాలకు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని జగన్‌ దారిమళ్లించాడన్నారు. 

తాను ప్రకటించిన పథకానికి ప్రత్యేకంగా నిధులివ్వడం చేతకాని జగన్‌ ఆయా వర్గాల నిధులు మళ్లించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల వార్షిక ఆదాయానికి  గండికొట్టాడన్నారు. జగన్‌ కేబినెట్‌లోని ఆయావర్గాల మంత్రులు, శాసనసభ్యులు దీనిపై ఏం సమాధానం చెబుతారని, వారంతా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని కాలవ సూచించారు. 

అసెంబ్లీలో జగన్‌ను పొగుడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులంతా తమతమ సామాజికవర్గాల వారు ఎంత నష్టపోతున్నారో, ఏవిధంగా నష్టపోతున్నారో తెలుసుకోవాలని టీడీపీనేత హితవు పలికారు. 

రూ.3,400కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల నిలిపివేత...

రూ.3,400కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు నిలిపివేసిన జగన్‌సర్కారు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. జగన్‌ తప్పిదం కారణంగా ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, వసతిగృహాల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...చాలా మంది అప్పులుచేస్తూ నెట్టుకొస్తున్నారని కాలవ తెలిపారు. 

అనేకచోట్ల లెక్చరర్లే ఇన్‌ఛార్జ్‌ వార్డెన్లుగా ఉన్నారని, ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారంతా దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారన్నారు. జగనన్న విద్యాదీవెన కింద ఏడాదికి ఒక్కోవిద్యార్థికి రూ.20వేలు ఇస్తానన్న జగన్‌, ఇప్పటివరకు ఒక్కరూపాయికూడా ఇవ్వలేదన్నారు. స్కాలర్‌షిప్పులపై  ఆధారపడి విద్యనభ్యసించేవారంతా జగన్‌నిర్ణయం కారణంగా రోడ్డునపడే దుస్థితి వచ్చిందన్నారు. దీనిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలను చూస్తున్న మంత్రులు ఏంసమాధానం చెబుతారని శ్రీనివాసులు నిగ్గదీశారు. 

జగన్‌ ప్రకటనలకు , ప్రభుత్వ చేతలకు ఎక్కడా పొంతనలేదన్నారు.  గ్రామీణ గృహ నిర్మాణపథకం కింద టీడీపీ ప్రభుత్వం 22లక్షల32వేలమందికి లబ్ధి చేకూర్చిందని, వాటిలో 7లక్షల 82వేల ఇళ్లనిర్మాణం మార్చి31, 2019నాటికి పూర్తయిందన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక ఇళ్లు నిర్మించుకున్నవారికి నిధులు ఇవ్వకుండా 5లక్షల63వేల ఇళ్లను పూర్తిగా రద్దుచేసిందన్నారు. 

నిర్మాణంలో జాప్యం జరిగిందన్న సాకుతో 01-04-2019 నుంచి ఈనాటివరకు పక్కాఇళ్లు నిర్మించుకున్న పేదలకు రూపాయికూడా ఇవ్వకుండా వారిని నిలువునా ముంచేసిన ఘనత జగన్‌సర్కారుకే దక్కిందన్నారు. రూ.1800 నుంచి రూ.2వేలకోట్లు విడుదలచేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇళ్లనిర్మాణాలు పూర్తవుతాయని, వారంతా ఆర్థిక బాధల్లోంచి విముక్తులవుతారని కాలవ పేర్కొన్నారు. ఈవిధంగా నిరుపేదలసంక్షేమానికి సమాధికట్టిన జగన్‌సర్కారు, బడుగు, బలహీనవర్గాలను, దళితులు,మైనారిటీలను బలిపీఠంపై నిలబెట్టిందన్నారు.      

 

click me!