చంద్రబాబుపై కార్యకర్తలను ఉసిగొల్పింది ఆ మంత్రులే...: అమర్‌నాథ్ రెడ్డి

By Arun Kumar PFirst Published Feb 27, 2020, 8:39 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులో వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారని... దీన్ని వెనకుండి నడిపించింది మంత్రులేనని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. 

గుంటూరు: ఇవాళ విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడుపైనే స్వయానా మంత్రులే దాడి చేయించారని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. వారు  ఎయిర్ పోర్టుకు రావడం, వారి శాసనసభ్యులను ఎయిర్ పోర్టుకు పంపండం, ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయమని ప్రభుత్వం చెప్పడం నిజంగా చరిత్రలో ఎప్పుడూ జరిగిన సందర్భాలు లేవని అన్నారు. 

విశాఖ దగ్గర్లోని అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని... ఇలాంటి బాధిత రైతులతో మాట్లాడేందుకు చంద్రబాబు వచ్చారని తెలిపారు. దీన్ని పూర్తిచేసుకుని   ప్రజా చైతన్య యాత్ర కోసం విజయనగరం వెళ్లాలని చంద్రబాబు భావించారని... అయితే అంతలోనే పోలీసులు అయన్ను అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇలా ఇష్టం వచ్చినట్లు చేయడం దారుణమన్నారు. 

read more  ఆ సంఘటనే చంద్రబాబును అడ్డుకోడానికి కారణం...: కళా వెంకట్రావు

వైసిపి లాంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య భారతదేశంలో కొనసాగడం నిజంగా కరెక్ట్ కాదన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి తెలిపారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం వుందన్నారు. 

ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనడానికి మంత్రులు మాట్లాడిన మాటలే నిదర్శనమన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష నాయకుడితోనే  ఇలా వ్యవహరిస్తే సామాన్య ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారని అడిగారు. అన్ని విషయాల్లో పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రజలను భయపెట్టడం, దోచుకోవడం, లూటీ చేయడం చేస్తున్నారని... ఈ కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టిపెట్టి ముందుకు వెళుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 

read more  చంద్రబాబుపై చెప్పులు వేయమని చెప్పిందే ఆయన...: మాజీ మంత్రి జవహర్

ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి పూర్తిగా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని అన్నారు.  దేశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చారని అన్నారు. ఇవాళ విశాఖలో చోటుచేసుకున్న ఘటనను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని... ఖచ్చితంగా వీటిని ఆపాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు.  

click me!