వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని కోసం నిరసనకు దిగిన అమరావతి ప్రజలపైన అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు: బుధవారం రాత్రి విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కళా వెంకట్రావు సీరియస్ కామెంట్స్ చేశారు. టిడిపి నాయకుల అక్రమ అరెస్ట్ లను ఆయన తీవ్రంగా ఖండించారు. అధికార అండతో వైసిపి ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతియుతంగా ర్యాలీలు, దీక్షలు చేస్తున్న నాయకుల అరెస్ట్ గర్హనీయమని... రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. నిరసనలు తెలిపే హక్కు హరించడం నియంతృత్వమే అవుతుందన్నారు. చరిత్రలో నియంతలంతా కాలగర్భంలో కలిసి పోయారని... ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందన్నారు.
undefined
మాజీ సిఎం చంద్రబాబుపై రాళ్లు వేస్తే అది నిరసనగా డిజిపి పేర్కొన్నారని... నిరసన తెలిపే హక్కు రాజ్యాంగమే కల్పించిందని అన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడదే డిజిపి వేలాది కేసులు ప్రజలపై ఎలా బనాయిస్తారో చెప్పాలని నిలదీశారు. రైతులు, మహిళలు, విద్యార్ధులపై ఇన్ని కేసులు గతంలో ఎన్నడూ పెట్టిన సందర్భాలు లేవని... ఇంతమందిని అక్రమంగా నిర్బంధించడం సబబు కాదన్నారు.
గుండెపోటుతో మరో రాజధాని రైతు మృతి
''ఒక్కచోట అనికాదు రాష్ట్రవ్యాప్తంగా ఇంతమందిని అరెస్ట్ లు చేస్తారా..? 13 జిల్లాలలో ఇంతమందిపై ఇన్ని కేసులా..? న్యాయం చేయమని అడిగేవాళ్లపై ఇన్ని సెక్షన్లు పెడతారా..?
తెనాలిలో దీక్షా శిబిరాన్ని కూల్చేస్తారా..? విజయవాడలో జెఏసి ఆఫీస్ కు తాళాలు వేస్తారా..? జెఏసి బస్సులను విజయవాడలో రానివ్వకుండా చేస్తారా..?
రైతులపై, రైతు కూలీలపై హత్యా యత్నం కేసులు పెడతారా..?'' అని ప్రశ్నించారు.
''నిరసన తెలియజేస్తున్న మహిళలను రాత్రివేళ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తారా..? అలా చేయమని ఏ చట్టం చెప్పింది. మహిళలను రాత్రివేళ స్టేషన్లకు తీసుకురమ్మని పోలీసులను అసలు ఎవరు ఆదేశించారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేస్తే సహించేది లేదు. మహిళలను అవమానించేలా వ్యవహరించి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి'' అని వెంకట్రావు డిమాండ్ చేశారు.
''బుధవారం మాజీ సీఎం చంద్రబాబును విజయవాడ నడిరోడ్డుపై నాలుగు గంటలు నిలబెడతారా..? మొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విజయవాడలో అరెస్ట్ చేసి తోటవల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, చినకాకాని వద్ద అదుపులో తీసుకున్నట్లు చెబుతారా..? ఇవాళ తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పోలీస్ వాహనంలో రెండు గంటల పాటు దుగ్గిరాల, తెనాలి స్టేషన్లకు తిప్పుతారా..?
విశాఖలో, విజయనగరంలో, ఒంగోలులో, సీమ జిల్లాలలో టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తారా..? సోషల్ మీడియా కార్యకర్త అవినాష్ ను మాచర్ల పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధిస్తారా..? నెల్లూరులో జెఏసి ర్యాలీకి పోటీగా వైసిపి ర్యాలీ పెట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తారా..?'' అని ప్రశ్నించారు.
read more దృష్టి మరల్చడానికే చంద్రబాబు హంగామా... విజయవాడ ఘటన ఆయన స్క్రిప్టే: హోంమంత్రి సుచరిత
పోగాలం దాపురిస్తే ఇలాంటి బుద్దులే పుడతాయని మండిపడ్డారు. గృహ నిర్బంధాలు, అరెస్ట్ లు, అక్రమ కేసులతో ఆందోళనలను ఆపలేరన్నారు. 7నెలల్లో ఇంతగా చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వం దేశంలోనే లేదని విమర్శించారు. మంచి సీఎం అవుతానని చెప్పి దేశంలోనే చెడ్డ సీఎంగా పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డేనని... ఈ అరాచకాలకు వైసిపి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని కళా వెంకట్రావు హెచ్చరించారు.