అంతకు మించి... ఆ పోలీసులు రిటైరయినా వదిలిపెట్టం...: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jan 6, 2020, 7:34 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించరాదంటూ ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమంపై పోలీసులు వ్యవహరిస్తున్నతీరు అమానుషంగా వుందని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.ఇలాంటి పోలీసులకు భవిష్యత్ లో అంతకు మించిన టార్చెర్ చూపిస్తామని హెచ్చరించారు. 

అమరావతి: రాజధానిని తమ ప్రాంతం నుండి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు నిరసనబాటపట్టారు. ఈ క్రమంలో ఇటీవల మందడంలో నిరసన తెలియజేస్తున్న మహిళల పట్ల పోలీసులు కాస్త దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి కూడా పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇలా పోలీసుల దాడిలో గాయపడిన మహిళలను ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

 రాజధాని తరలింపు వార్తతో తీవ్ర మనస్థాపానికి గురయి మృతిచెందిన మందడానికి చెందిన గోవిందు కుటుంబసభ్యులను చంద్రబాబు మొదట పరామర్శించారు. అతడి ఇంటివద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల దాడిలో గాయపడ్డ మహిళలను కూడా చంద్రబాబు పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కి పట్టిన గతే రాజధాని విభజన వల్ల వైసిపి పడుతుందన్నారు. రాజధాని కోసం పోరాడుతున్న వారందరిని అరెస్టులు చేసుకుంటూ పోతే జైళ్లు సరిపోవని... అయినా కూడాఉద్యమం మాత్రం ఆగదన్నారు. ఇది ఐదుకోట్ల మంది ప్రజల ఉద్యమమని అన్నారు.

read more అందుకోసమే భువనేశ్వరి ఎంట్రీ... నాపై దాడి వారిపనే: వైసిపి ఎమ్మెల్యే రోజా

ప్రస్తుత వైసిపి ప్రభుత్వ హయాంలో దుర్మార్గులు రాజ్యమేలుతున్నారని...  ఇలాంటి సమయంలో కొన్ని బాధలు తప్పవన్నారు. అయితే అవేవీ శాశ్వతం కాదని ప్రజలు  గుర్తించాలని... రాష్ట్ర భవిష్యత్ కోసం కొన్నాళ్లు ఈ బాధలను భరిస్తూనే ఉద్యమం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. 

ప్రజలకు రక్షణగా వుండాల్సిన పోలీసులు పాలకుల పంచన చేరారని... తాము కూడా ప్రజల్లో ఒకరిమన్న విషయాన్ని వారు మరిచిపోతున్నారని అన్నారు. తమకు  కూడా భార్యా బిడ్డలున్నారని గుర్తుంచుకోవాలని...  సమాజంలో తామూ ఓ భాగమేనని గుర్తెరిగి  నడుచుకోవాలన్నారు. 

కేవలం జీతం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగ ధర్మం కోసం పోలీసులు పని చేయాలన్నారు. మహిళలపై దౌర్జన్యం చేసిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని... భవిష్యత్ లో వారు రిటైరయినా కూడా వేదించడం ఖాయమన్నారు. వారిపై ప్రయివేటు కేసులు వేసి అదేరీతిలో అరెస్టు చేపిస్తామని హెచ్చరించారు. 

ప్రస్తుతం ఆంధ్ర  ప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారో... పోలీసు రాజ్యంలో ఉన్నారో అర్ధం కావట్లేదన్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని... పోయేకాలం దాపురించినప్పుడు ఇలానే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారన్నారు. 

read more  మూడు రాజధానుల వల్ల లాభపడేది తెలంగాణే... అందువల్లే తలసాని...: బీద రవిచంద్ర

రైతులు ధర్మంగానే పోరాడుతున్నారు కాబట్టి ధర్మమే గెలుస్తుందన్నారు. మహాభారతంలో మొదటినుండి ఎగిరెగిరిపడిన 100మంది కౌరవులు అంతిమంగా ఓటమిపాలయ్యారని గుర్తుంచుకోవాలంటూ వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

click me!