ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజధాని ప్రాంతంలో సందర్శించే ప్రదేశాలకు సంబంధించిన వివరాలను టిడిపి వెల్లడించింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రేపు(గురువారం) మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తీవ్ర కసరత్తును పూర్తిచేసిన పార్టీ ఆయన పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను విడుదలచేసింది. ఇవాళ పార్టీ ముఖ్యనాయకులతో చంద్రబాబు సమావేశం అనంతరం ఈ రూట్ మ్యాన్ ను విడుదలచేశారు.
గురువారం ఉదయం 9గంటలకు తన నివాసం నుంచి టిడిపి ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటనను ప్రారంభించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ ద్వారా వెంకటపాలెం మీదుగా ఉద్దండరాయపాలెం చేరుకుంటారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోడి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు.
read more అమరావతి పర్యటనపై టెన్షన్... కీలక నేతలతో చంద్రబాబు సమావేశం
అక్కడినుండి బలహీన వర్గాలు, నిరుపేదల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత గజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గజిటెడ్ ఆఫీసర్స్, క్లాస్ 4 ఉద్యోగులు, ఐఏఎస్, ఐపిఎస్, ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల గృహ సముదాయాల నిర్మాణాన్ని పరిశీలిస్తారు. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల హౌసింగ్ సముదాయాలు, జడ్జిల బంగ్లాలను పరిశీలించిన తర్వాత విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాలను సందర్శిస్తారు.
ఈ పర్యటనలో వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెం, నేలపాడు, రాయపూడి, ఐనవోలు తదితర గ్రామాల మీదుగా టిడిపి నేతల బృందం పర్యటన సాగుతుంది. టిడిపి ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో రాజధాని నగరం అమరావతిలో నిర్మించిన నిర్మాణాలు, రోడ్ ప్రాజెక్టులను, భవనాలను కూడా పరిశీలించనున్నారు.
అలాగే గత ఆరు నెలలుగా పనులు నిలిపేయడం వల్ల ఏవిధంగా వేలాది కూలీలు జీవనోపాధి కోల్పోయారో... రాజధాని ప్రతిష్టకు ఎలా భంగం కలిగిందో ప్రజల దృష్టికి తీసుకురావడమే ఉధ్దేశంగా చంద్రబాబు బృందం పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో టిడిపి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, రాజధాని ప్రాంత నాయకులు చంద్రబాబుతో కలిసి ఈ పర్యటనలో పాల్గొననున్నారు.
read more కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శుభవార్త... ఏపి కేబినెట్ కీలక నిర్ణయం
అమరావతి ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మాజీ సీఎం, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో ఈ ప్రత్యేక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి పర్యటనపై వైసిపీ నేతల వ్యాఖ్యలు, రైతులు నిరసనకు పిలుపునివ్వడం తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. వీటిని దృష్టిలో వుంచుకుని రేపు పర్యటన సందర్భంగా అనుసరించాల్సిన కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కొన్ని రైతు సంఘాలు చంద్రబాబు పర్యటన ను అడ్డుకుంటామని ప్రకటించాయి. దళిత రైతులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు... వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా వైసిపి నాయకులు కూడా చంద్రబాబు అమరావతి యాత్రపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.