శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటి అమరావతిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై తుది నిర్ణయం తీసుకోవడమే ప్రధాన ఎజెండాగా శుక్రవారం(రేపు) కేబినెట్ భేటీ జరగనుంది. అయితే అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరుగుతుందన్న దానిపై ఇప్పటివరకు సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
రేపు అమరావతి సచివాలయంలో గానీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో గానీ మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఈ సమావేశం జరుగుతుందన్న ప్రచారం జరిగినా ఏర్పాట్లకు సమయం తక్కువగా వుండటంతో అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 10.30 కు కేబినెట్ భేటీ జరగనుంది. జీఎన్ రావు కమిటీ రాజధానిపై ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మూడు రాజధానులపై క్యాబినెట్ లో కీలక చర్చ జరగనుంది. జీఎన్ రావు కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించే అవకాశం వుంది.
అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలపైనా మంత్రివర్గం చర్చించనుంది. రాజధాని రైతుల అభిప్రాయాల సేకరణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలులో వెటర్నరీ పాలిటెక్నిక్ ఏర్పాటుపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు.
ప్రస్తుతం ఎంఎస్పీ వర్తిస్తున్న పంటలు మినహా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించే అంశంపై చర్చించనున్నారు. ఏపీఐఐసి ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. సీఆర్డీఏ ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.