ఏపిలో కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని సజ్జల రామకృష్ణారెెడ్డి తప్పుబట్టారు. ఈ వాయిదా ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించే మంచి అవకాశాన్ని దూరం చేశారని మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల వద్దకు నేరుగా పాలనను తీసుకువెళ్ళాలని భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వారికి పాలనాపగ్గాలు అప్పగించాలని చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డుకుందని అన్నారు.
మరో వారం రోజుల్లో ఎన్నికలు జరిగే తరుణంలో ఈసి సైందవ పాత్ర పోషిస్తూ హటాత్తుగా ఎన్నికలను వాయిదా వేసిందని మండిపడ్డారు.
ఇది హటాత్తుగా తీసుకున్న నిర్ణయం అని మీడియాకు కూడా తెలుసన్నారు. ముందు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ గురించి చెప్పి ఆఖరున ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఈ వాయిదా ప్రకటనపై సీఎం జగన్ ఇప్పటికే స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీనికి సంబంధించి ఏం జరిగింది... ఏం జరగవచ్చు.. రాష్ట్రానికి ఇది ఎటువంటి నష్టం జరుగుతుందో వివరించారని అన్నారు. నిరంకుశంగా, అడ్డగోలుగా ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం ఇదని... ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్లిందని గుర్తుచేశారు.
''రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి ఒక ప్రోసీజర్ వుంటుంది. కమిషన్ లోని అధికారి అప్పటికప్పుడు సొంతగా తన నిర్ణయాలను ప్రకటించవచ్చా? ఎన్నికల కమిషన్ లోని అధికారులకు కూడా రమేష్ కుమార్ గారి నిర్ణయం షాక్ ఇచ్చింది. రాజ్యాంగ పరిధిని దాటి బాధ్యతలను నిర్వర్తించడంలో అన్ని ఉల్లంఘనలే కనిపించాయి. తన పరిధిని దాటి, ప్రభుత్వాన్ని కూడా మించి రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పు'' అని అన్నారు.
''ఎన్నికలను వాయిదా వేస్తూ... కోడ్ ను ఎలా కొనసాగిస్తారు? దురాలోచన, దురద్దేశంతో, వెనుక ఎవరో వుండి నడిపిస్తున్న దానిలో భాగంగా తీసుకున్న నిర్ణయం ఇది. కరోనా వైరస్ ఉదృతంగా వుందని ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ చెప్పారు. 6వ తేదీన రాజకీయపార్టీల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కరోనా వైరస్ గురించి చర్చ జరిగింది.
రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత..కరోనా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని... ఎన్నికలకు వెడుతున్నామని రమేష్ కుమార్ చెప్పారు'' అని గుర్తుచేశారు.
''అయితే ఆదివారం రమేష్ కుమార్ చేసిన ప్రకటన కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరాలు, నివేదికను తీసుకున్నారు? కరోనాపై పూర్తి వివరాలు తీసుకున్న తరువాత ఆయన ఎటువంటి నిర్ణయాలు అయినా తీసుకోచ్చు. కరోనా పై చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీలను పిలిచి సమీక్షించి, వివరాలు ఆన్ రికార్డ్ గా తీసుకోవాలి.ఎన్నికల కమిషన్ అనేది ఒక వ్యవస్థ... ప్రోటోకాల్ ప్రకారం ఈ వ్యవస్థ నడుస్తుంది. ఆరో తేదీ తరువాత కరోనా గురించి ఏ రాజకీయ పార్టీ అయినా మీకు లేఖ రాసిందా? దీనిపై లేదు అనే సమాధానం వస్తోంది'' అంటూ ఈసీపై విమర్శలు చేశారు.
read more స్థానికసంస్థల వాయిదా... మాజీ ఎన్నికల కమీషనర్ తో జగన్ మంతనాలు
''ఒక వేళ ఎన్నికల అధికారి కరోనా గురించి ఆలోచిస్తే...దానిపై ఏం చేయాలనే దానికి ఒక ప్రాసెస్ వుంది. ఎన్నికల గేదరింగ్ లపై కరోనా ప్రభావం లేకుండా ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. కరోనా వల్ల ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలను కూడా పిలిచి మాట్లాడాల్సి వుంది. ఇందులో ఎటువంటి ప్రక్రియను రమేష్ కుమార్ ఫాలోకాలేదు'' అని అన్నారు.
''రమేష్ కుమార్ ప్రకటన తరువాత వెంటనే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేయాలని మేం అడిగామంటూ చంద్రబాబు చెప్పుకున్నారు.
అధికారంలో వున్న పెద్దపార్టీగా వైఎస్ఆర్సిపిని కరోనా గురించి రమేష్ కుమార్ ఎందుకు అడగలేదు? రమేష్ కుమార్ మీడియా ముందే తన నోట్ బుక్ లో రాసుకున్న దానిని గురించి మాట్లాడారు. టిడిపి నాయకుడి ఇంట్లోనో, అధ్యక్షుడి వద్దనో, లాయర్లు సిద్దం చేసిన దానిని...రమేష్ కుమార్ చదివి వుంటాడని మేం అనుకుంటున్నాం. అటువంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా రమేష్ కుమార్ వ్యవహారం వుంది'' అని సంచలన ఆరోపణలు చేశారు.
''243 ప్రకారం ఎన్నికల నిర్వహణ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత. రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు సిద్దంగా వుందని తెలిపిన తరువాతే ఎన్నికల నిర్వహణను కమిషన్ చేపడుతుంది. నిర్వహణ ప్రక్రియపై పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కు వుంటాయి. మొత్తం ఎన్నికలు వాయిదా వేయాలంటే... ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వంకు ఆ విషయం తెలియచేయాలి. ఇక్కడ రమేష్ కుమార్ దానిని పూర్తిగా గాలికి వదిలేశారు.''
''అడ్డగోలుగా తన సొంత నిర్ణయం ప్రకటించారు. వాయిదా వేసిన ఆరువారాల పాటు కోడ్ వుంటుందని ప్రకటించారు. నిబద్దతతో పనిచే వ్యక్తి గా రమేష్ కుమార్ కనిపించడం లేదు
. ఆయనపై ఏ వత్తిడిపని చేసింది? నిజంగా విచక్షణ వుంటే.. రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. ప్రజాస్వామ్య ప్రక్రియను పట్టపగలు హత్య చేశారు'' అని మండిపడ్డారు.
''ఇళ్ళ స్థలాల పంపిణీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మేం ప్రకటించాం. కానీ దీనిని నిలిపివేయాలంటూ వాయిదా కు ముందు రోజే రమేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
తరువాత రోజు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిలకు ముందే ఇళ్ళ స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అది ఎన్నికల ప్రలోభాలకు గురి చేసే అంశం ఎలా అవుతుంది? దీనిని నిలిపివేయాలని అన్నారు. మేం దానిని గౌరవించాం. ఆరు వారాల పాటు ఎన్నికలను పొడిగిస్తూ... కోడ్ ను కూడా కొనసాగిస్తామని చెప్పారు'' అంటూ కమీషనర్ వ్యవహారశైలిని తప్పుబట్టారు.
''కరోనా వైరస్ ను నియంత్రించే విషయంలో అగ్రరాజ్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రపంచమే ఈ వైరస్ ను ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నాయి. ఒక్క మన రాష్ట్రమే పూర్తిస్థాయిలో దీనిని నియంత్రించగలదా? ఈ వైరస్ ను తట్టుకోవాలంటే కిందిస్థాయిలో నియంత్రించే పటిష్టమైన వ్యవస్థ అవసరం. ఒక ఊరిలో ఎంపిటిసి, జెడ్పీటిసి, వార్డు సభ్యులు ఎన్నికైతే వారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కరోనా లక్షణాలు వున్న వారిని గుర్తించేందుకు వారు బాధ్యత తీసుకుంటారు.వ్యాధి లక్షణాలు వున్న వారికి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రజాప్రతినిధులుగా వారు పనిచేస్తారు.ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఒక మంచి వ్యవస్థ సిద్దమయ్యేది. కానీ ఆఖరి నిమిషంలో ఎన్నికల వాయిదా నిర్ణయంతో ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారు'' అని అన్నారు.
read more టిడిపికి మరో బిగ్ షాక్... వైసిపిలో చేరిన మాజీ మంత్రి
''కరోనా సంక్షోభం అంతటా పెరుగుతోంది. చైనా, కొరియా, ఇటలీతో పాటు మనదేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో స్థానిక ఎన్నికల వల్ల కిందిస్థాయిలో బాధ్యతాయుతమైన వ్యవస్థ ఏర్పడేది. కేంద్రం నుంచి రావాల్సిన అయిదువేల కోట్ల నిధులువచ్చేవి. కానీ వాటిని కూడా అడ్డుకున్నారు. గోవాలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. విదేశీయులు ఎక్కువ వచ్చే చోట జరుగుతున్న ఎన్నికలకు కరోనా ఎఫెక్ట్ లేదా? స్థానికంగా మన వద్ద జరిగే ఎన్నికలకు ఎఫెక్ట్ వుంటుందా?''అని ప్రశ్నించారు.
''ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబుకు పోటీ చేయడానికి మనుషులు దొరకడం లేదు.చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం పూర్తిగా పోయింది.మునిగే ఈ పడవ నుంచి బయటకు వచ్చేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. మేం గేట్లు తెరవక కానీ తెరిస్తే... వివపరీతంగా మా పార్టీలోకి వలసలువస్తాయి. టిడిపి నుంచి వారంతట వారు మా పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా వున్నారు. చంద్రబాబుపై నమ్మకం లేని వారు మా వైపు చూస్తున్నారు. మేం తీసుకోవాలని అనుకుంటే చంద్రబాబు, ఒకరిద్దరు మినహా...మిగిలిన వారందరూ మా పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా వున్నారు''
''ఈ పరిస్థితి చంద్రబాబుకు తెలుసు. అందుకే ముందునుంచే ఒక ప్రణాళిక ప్రకారం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. దాడులు చేస్తున్నారని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు.
దానిని కొనసాగింపులో భాగంగానే నిన్న ఎన్నికల అధికారి చేసిన వాయిదా ప్రకటన. ఎన్నికలను వాయిదా వేసినప్పుడు... అధికారులపై చర్యలకు ఎన్నికల అధికారి ఎలా సిఫార్స్ చేస్తారు?'' అని నిలదీశారు.
''స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవుతుండటాన్ని టిడిపి జీర్ణించుకోలేక పోతోంది. కొద్ది రోజుల పాటు అయినా ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఏకగ్రీవాలు సహజం. గతంలో కాంగ్రెస్, టిడిపి కలిసి పోటీ చేశాయి, ఒప్పందాలతో ఏకగ్రీవం చేసుకున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కొన్నిచోట్ల టిడిపికి కూడా ఏకగ్రీవం అయ్యాయి.సీఎం జగన్ ఊహించిన దానికన్నా వేగంగా సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశారు. దాని ఫలితంగా మాకు స్థానిక ఎన్నికల్లో ప్రజల నుంచి మద్దతు పెరిగి ఏకగ్రీవాలు పెరిగాయి.ఈ సంక్షేమ పథకాలు చూసి టిడిపి నుంచి పోటీకి కూడా ముందుకు రావడం లేదు'' అని సజ్జల పేర్కొన్నారు.