ఒక్క అవకాశం ఇచ్చింనందుకు ఎలాంటి పాలన సాగిస్తున్నారో చూడండి అంటూ మాజీ మంత్రి నారా లోకేశ్ వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు విసిరారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గతంలో తాము అనేక సంక్షేమ పథకాలను అందించామని... కానీ ఇప్పుడు వైసిపి సర్కార్ వాటిని మెల్లమెల్లగా ప్రజలకు దూరం చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇప్పటికే నిరుపేదలకు ఉపయోగపడే పెన్షన్లు, రేషన్ కార్డులను ప్రభుత్వం భారీగా తొలగించిందని లోకేశ్ మండిపడ్డారు.
''ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో...! రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారు వైఎస్ జగన్ గారు. పేద ప్రజల పట్ల ఆయనకి ఉన్న వ్యతిరేకతని పెంచుకుంటూ పోతున్నారు. 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారు'' అని లోకేశ్ ఆరోపించారు.
''మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైకాపా ప్రభుత్వం, రీ వెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది? ఇప్పుడు 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు?'' అంటూ లోకేశ్ ప్రశ్నించారు.
read more కుటుంబంలోని మహిళలతో అక్రమ వ్యాపారం...దిగజారిన జేసి..: కేతిరెడ్డి సంచలనం
''మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు.పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా? పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారు? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్ గారు సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారు'' అని లోకేశ్ సెటైర్లు విసిరారు.
''చంద్రబాబుగారి హయాంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన సంపద సృష్టి కేంద్రాలు ఇప్పుడు జగనన్న బార్లుగా మారిపోతున్నాయి. నాడు-నేడు అని బిల్డప్ ఇస్తున్న వైఎస్ జగన్ గారి నేడు ఎంత చెత్తగా ఉందో చూడండి'' అంటూ నాడు నేడు కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు.