విశాఖ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్ ను మంత్రి బొత్స తిప్పికొట్టారు.
విశాఖపట్నం పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. అసలు ఆయన మాటలు కాదు ఆ బాషే బాగోలేదని బొత్స విమర్శించారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆయన్ని చూసి భయపడ్డారని చెబుతున్నారు...కానీ నిజానికి ఎవరు ఎవరిని చూసి భయపడ్డారో ప్రజలందరికి తెలుసని అన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దంటూ చంద్రబాబుకు బొత్స సూచించారు.
''విశాఖలో గురువారం టిడిపి నాయకులతో చంద్రబాబు మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ సమయంలో ఐదు నిమిషాలు పవర్ ఆగిపోయిందట. దాన్ని చంద్రబాబు పెద్ద సమస్యగా పేర్కొని నాటకాలు ఆడటానికి ఉపయోగించుకుంటున్నారు.
అప్పుకోసం ఎస్‌బిఐ దగ్గర ప్రభుత్వం అవమానాలను ఎదుర్కొంటోందంటే అది మీ నిర్వాహకమే. మీరు చేసిన అడ్డగోలు కార్యక్రమాలు, నియమ నిభందనలు లేకుండా చేసిన వ్యవహారాలను మేం భరించాల్సివస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన అస్తవ్యస్ద పాలన,దోపిడీని నుండి ప్రభుత్వాన్ని చక్కబెట్టడంలోనే ఇప్పటివరకు మాకు టైం సరిపోవడం లేదు.
రాష్ట్రవిభజన వల్ల జరిగిన అన్యాయం, నష్టం కంటే మీ దోపిడీవల్లే ఎక్కువనష్టం జరిగింది. ఖజానాను దోపిడీచేసి దివాళా తీయించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. క్రమశిక్షణా లోపంతో పరిపాలన చేసినా వాటిని మేం సరిచేస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఐదువేల కోట్ల రూపాయల చెల్లింపుల బకాయిలుంటే గొప్ప. నేడు అది ఏభైవేలకోట్ల రూపాయలు చేశారు.'' అని చంద్రబాబుపై బొత్స ఫైర్ అయ్యారు.