ఎమ్మెల్సీగా మంత్రి పదవి... మండలి రద్దు చర్చపై మోపిదేవి ఏమన్నారంటే

By Arun Kumar P  |  First Published Jan 23, 2020, 5:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దుపై జరుగుతున్న చర్చపై మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఎమ్మెల్సీ హోదాలో మంత్రి పదవిని పొందిన ఆయన ఈ విషయంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసే దిశగా జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండలిలో టిడిపి మెజారిటీ వుంది కాబట్టి ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి బిల్లును అడ్డుకుంటున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాజధానికి సంబంధించిన కీలకమైన బిల్లును బుధవారం మండలి సెలెక్ట్ కమిటీకి పంపండంపై జగన్ ప్రభుత్వం సీరియస్ గా వుందని తెలుస్తోంది. దీంతో ప్రతిసారి ఇలా అడ్డుతగులుతున్న మండలిని రద్దు చేస్తే ఎలా వుంటుందన్నదానిపై సీఎం జగన్ కీలక మంత్రులు, పార్టీ నాయకులతో చర్చించినట్లు సమాచారం. 

ఈ క్రమంలో ఎమ్మెల్సీ  హోదాలో మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణ మండలి రద్దుపై జరుగుతున్న చర్చపై  స్పందించారు. బుదవారం ఏపి 
శాసనమండలి జరిగిన తీరు బాధాకరమన్నారు. చైర్మన్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని వుంటే బావుండేదన్నారు.

Latest Videos

ప్రస్తుతం శాసనమండలి ఉండాలో, రద్దు చేయాలో అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోందని... ప్రభుత్వం, న్యాయ నిపుణులు చర్చించి దీనిపై  నిర్ణయం  తీసుకుంటుందన్నారు. తనకు మండలి సభ్యుడుగా మంత్రి పదవి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే తనకు పదవి ముఖ్యం కాదు...రాష్ట్రాభివృద్ధి ముఖ్యమన్నారు. అందుకోసం ప్రభుత్వం ఎలాంటి  నిర్ణయం తీసుకున్నా కట్టుబడి  వుంటానని అన్నారు.  

read more  ఏపికి శాసనమండలి అవసరమా...?: అంబటి రాంబాబు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై మండలిలో జరిగిన పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో మాట్లాడుతూ... 70 ఏళ్ల నాడే ఆచార్య ఎన్జీ రంగా పెద్దల సభ అవసరం లేదని చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రజలు ఎన్నుకున్న సభ ఆమోదించిన చట్టాలను శాసనమండలి ఎలా అడ్డుకుంటుందని ధర్మాన ప్రశ్నించారు.

నాలుగు నెలల కాలం వరకు ఏ బిల్లునైనా సెలెక్ట్ కమిటీకి పంపితే ఆపగలరని.. ఇది మంచి పద్ధతి కాదని ప్రసాదరావు తెలిపారు. ఇలా చూసీ చూడనట్లు పోతుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయలేరని, ప్రభుత్వం పరుగులు తీయాలనుకుంటే పెద్దల సభ అడ్డుపడుతుందని ప్రసాదరావు గుర్తుచేశారు.

read  more  మండలి ఛైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు...మంత్రులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

ప్రభుత్వాన్ని నడనివ్వకుండా చేయడం కోసం ఇలాంటి దురుద్దేశాలకు ఎప్పుడూ ఒడిగడుతూనే ఉంటారని, మండలిని కొనసాగించాలా..? వద్దా అన్న విషయంపై ఆలోచించాలని ముఖ్యమంత్రిని ధర్మాన కోరారు.

click me!