ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వరూపానంద స్వామి సలహాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనిపిస్తుందని పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధానికి ఒక్క అమరావతిలోనే కాకుండా వెనుకబడిన ప్రాంతాలయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టిడిపి నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేఎస్. జవహర్ ట్విట్టర్ వేదికన సంచలన వ్యాఖ్యలు చేశారు.
''ఆయనకి పాదాభివందనం చేసి విశాఖలో రాజధాని పెడితే, మీరు భావి ప్రధాని, మీ ఆత్మ విజయసాయి రెడ్డి భావి ముఖ్యమంత్రి అయిపోతారని మీ సద్గురు స్వరూపానంద ఏమన్నా సలహా ఇచ్చారా వైఎస్ జగన్ గారూ? అందుకోసమే ఇంత ఆత్రపడుతున్నారు, మా సందేహాలు తీర్చండి మరి!'' అంటూ సెటైర్లు విసిరారు.
మరో ట్వీట్ లో ''మీ క్రియేటివ్ జీనియస్... విజయసాయి రెడ్డి గారేమో విశాఖ పాలనా రాజధానే అంటారు, మీ అతితెలివి మంత్రులేమో అబ్బే అదేం లేదంటారు, మీరేమో ఇంకో కమిటీ రిపోర్టులు రావాలంటారు. ఇలా రాష్ట్రంతో, రాజధానితో మూడు ముక్కలాట ఆడడమేనా మీ పని వైఎస్ జగన్ గారూ? పూటకో మాటమారుస్తూ ఊసరవెల్లికి పోటీ వస్తున్నారుగా!
వైకాపా నాయకుల డ్రామాలు చూస్తుంటే నవ్వొస్తుంది. రైతుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు నిన్న మంత్రివర్గ ఉప సంఘం రిపోర్ట్, ఇన్సైడర్ ట్రేడింగ్, ఆధారాలతో సహా రిపోర్ట్ అని లీకులు వదిలి హడావిడి చేసారు'' అంటూ జవహర్ విమర్శించారు.
read more Capital Crisis : 11వ రోజుకు చేరిన రాజధాని మహాధర్నా
తాజాగా ఎంపీ విజయ్ సాయి రెడ్డి,మంత్రి అవంతి శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఇదివరకు తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటు టిడిపి చేస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించారు.
ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణకైనా ఎఫ్‌బిఐ విచారణకైనా సిద్దమని వైసీపీ ఎంపీ అన్నాడు. తన వాళ్ళు తన కుటుంబం మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి చంద్రబాబని, కుటీలమైన మనస్సుతత్త్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు.
రాజధాని ప్రకటన త్వరలోనే ఉంటుందని, సీఎం త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారాణి ఆయన చెప్పారు. విశాఖ ఉత్సావాలలోనే కాదు ఇక నిత్యం విశాఖలో పండగ వాతావరణం ఉంటుందని ఆయన రాజధాని విశాఖనే అంటూ చెప్పకనే చెప్పారు.
read more దొంగల ముఠా, జగన్ ఏం చెప్తారు: దేవినేని ఉమ ధ్వజం
అమరావతి పేరుతో మాజీ ముఖ్యమంత్రి ఆయన గ్యాంగ్ కమీషన్ వ్యాపారం చేసారని, తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఫండింగ్ ఉద్యమాలు నడుపుతోందని, చంద్రబాబు కు ఫండింగ్ ఉద్యమాలు నడపడం అలవాటే అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
మంత్రి అవంతి మాట్లాడుతూ... కులాల ,మతాలు, ప్రాంతీయ వర్గాల మధ్య చిచ్చుపెట్టి వారిని రెచ్చగొట్టే వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ ను త్వరలోనే బయటపెడతామని అన్నాడు.
న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విశాఖ రాజదాని ని చంద్రబాబు అడ్డుకోవాలని చూస్తున్నారని, విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడమని టీడీపీ నాయకులను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడని, ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అని ఆయన అభిప్రాయపడ్డాడు.