కలానికి కులాన్ని ఆపాదించిందెవరో... చర్చకు సిద్ధమా?: కళా వెంకట్రావు సవాల్

By Arun Kumar PFirst Published Nov 1, 2019, 7:39 PM IST
Highlights

పత్రికా స్వేచ్చను హరిస్తున్న ప్రభుత్వం దానిపై ప్రశ్నిస్తున్న టిడిపి పార్టీపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా వుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు.

గుంటూరు: కలానికి కులాన్ని ఆపాదించి పత్రికా విలువలను దిగజార్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి చరిత్ర ప్రజలందరికి తెలుసని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు  మండిపడ్డారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ 2007లో అప్పటి వైఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 938ను తప్పుపట్టిన దేవులపల్లి అమర్‌, రామచంద్రమూర్తులు ఇప్పుడు జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు మద్ధతు తెలపటం సహేతుకం కాదని అన్నారు.

దుష్టబుద్ధి గల ఇద్దరు మంత్రులు కలానికి కులతత్వం, ప్రాంతీయతత్వంతో రెచ్చగొడుతూ మంత్రి స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. అవినీతి సాక్షి మీడియాలో వచ్చే వార్తలు, ఇతర మీడియాలో వచ్చే వార్తలను పరిశీలించి మంత్రి చెప్పినట్లు కంపు ఎందులో ఉందో ప్రజలే నిర్ణయించాలన్నారు. పచ్చి అవినీతి, పచ్చి విషపు ప్రచారం, పచ్చి అబద్దాలతో పాటు మంత్రి చెప్పిన కంపు ఒక్క సాక్షి మీడియాలో మాత్రమే ఉందో? లేక ఇతర మీడియాలో ఉందో బహిరంగ చర్చకు సిద్ధమా అని కళా వెంకట్రావు సవాల్ విసిరారు. 

పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా జగన్‌ ప్రభుత్వం నల్ల జీవో నెం. 2430ను తీసుకువచ్చిందని  ఆరోపించారు. మీడియాపై సంకెళ్లను దేశ వ్యాప్తంగా తప్పుపట్టినా ఇంత వరకు జగన్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోవడం నిరంకుశ మనస్థత్వానికి నిదర్శనమన్నారు. 

read more  ఇది ప్రభుత్వమా... జగన్ రియల్ ఎస్టేట్ సంస్థనా...?: సుజయకృష్ణ రంగారావు

వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛను వాడుకుందన్నారు. తప్పుడు కథనాల పేటెంట్‌ సాక్షి మీడియాదేగాని మరెవ్వరిదీ కాదని సెటైర్లు విసిరారు.  జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని నల్ల జీవోను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలన్నారు. కలానికి కులాన్ని ఆపాదించినందుకు మంత్రులు క్షమాపణలు చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. 

మాజీ ఎమ్మెల్యే  బోండా ఉమ మాట్లాడుతూ... పత్రికా స్వేచ్చను హరించేలా ఉన్న జిఒ నెంబర్ 2430ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఆయన జీఓ కాపీలను దగ్ధం చేశారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాకు ప్రత్యేక స్థానం రాజ్యాంగం కల్పించిందని....అయితే జగన్ తన అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండాలనే 2430 జి.ఒ తెచ్చారని అన్నారు. 

read more  క్వారీ కోసమే సామాన్యులపై కేసులు...: వైసిపి ఎమ్మెల్యేపై కాల్వ శ్రీనివాసులు ఆరోపణ

ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే కేసులంటూ భయపెడుతున్నారని...అవినీతి, అక్రమాలు చేసే వాళ్లు ఆధారాలతో అందరూ చూసేలా‌ చేస్తారా...? అని ప్రశ్నించారు.ఆనాడు మీ పత్రికలో వేల కోట్లు అవినీతి జరిగిందని అవాస్తవాలు రాశారని...వాటన్నింటికీ ఆధారాలు చూపించి రాశారా..? అని ప్రశ్నించారు. కనీసం వివరణ అడిగారా...అని అన్నారు. 

టిడిపి హయాంలో అవినీతి ఉంటే ఈ ఐదు నెలల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని... ప్రజలు, మీడియా హక్కులను హరించేలా జగన్  ప్రజాస్వామ్య వాదులు, మేధావులు కూడా స్పందించాలన్నారు.

click me!