గుంటూరు జిల్లాలో చిన్నారి బాలికపై జరిగిన అత్యాచార కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
గుంటూరు: వైఎస్సార్‌సిపి నాయకుడు కాసు మహేశ్‌రెడ్డి అండ చూసుకుని పల్నాడు ప్రాంతంలోని ఆయన అనుచరులు దారుణాలకు, అత్యాచారాలకు తెగబడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వారు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె మండిపడ్డారు.
ఆరు సంవత్సరాల పసి పాపపై ఈ నెల 19వ తేదీన నరేంద్రరెడ్డి అనే వైసిపి కార్యకర్త మాయ మాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టడం సభ్యసమాజానికి సిగ్గుచేటన్నారు. ఇటువంటి నీచులను అధికార పార్టీ అండదండలు అందించి కాపాడటం హేయమైన చర్య అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
undefined
అత్యాచారానికి గురై పిడుగురాళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెలుగుదేశం మహిళా నేతలతో కలిసి అనురాధ శుక్రవారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగి వారం రోజులు గడచినా కనీసం అధికార పార్టీగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోకపోవడంతో దారుణమన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వద్ద బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకోవడం జరిగిందన్నారు.
read more క్వారీ కోసమే సామాన్యులపై కేసులు...: వైసిపి ఎమ్మెల్యేపై కాల్వ శ్రీనివాసులు ఆరోపణ
ఈ ఘటనపై టీడీపీ నేతలు స్పందించేవరకు అధికార పార్టీ స్పందించలేదని, ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అన్న భయంతో... ఆఘ మేఘాలపై స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మాట్లాడారే తప్ప ఇంతవరకు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనురాధ అన్నారు.
వైసిపొ నాయకుడి అనుచరుడు కాబట్టే అతనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రులు సైతం బాధిత కుటుంబానికి న్యాయంచేస్తామని... దోషులను శిక్షిస్తామని హామీ ఇవ్వకపోగా, మీకేమైనా ఆర్థిక సాయం కావాలా అని అడగటం మంత్రుల యొక్క దిగజారుడుతనానికి ఇదొక ఉదాహరణ అన్నారు.
బాధిత కుటుంబ సభ్యులు నిందితుడికి శిక్ష పడాలని కోరుతున్నప్పటికి కూడా ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. ఘటనపై స్పందించిన హోంమంత్రి సైతం నిందితుడిపై చర్యలు తీసుకోకుండా సమస్యను రాజీ చేసే ప్రయత్నం చేశారని అనురాధ తెలిపారు. ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్న మంత్రులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ దాడి ఘటనను ప్రశ్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారని, ఇటువంటి చర్యను గతంలో తాము ఎన్నడూ చూడలేదన్నారు.
read more video: ఉన్నతాధికారుల వేధింపులు... నడిరోడ్డుపై కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
అత్యాచారానికి గురైన బాలిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నప్పటికి పోలీసులు లెక్క చేయకుండా మంత్రుల ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్ నుండి బలవంతంగా తరలించడం చూస్తే ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతోందో అర్థమౌతోందన్నారు. వైకాపా కార్యకర్తను కాపాడేందుకే పై స్థాయి నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఘటనను వెలుగులోకి రాకుండా ప్రయత్నం చేస్తున్నారని అనురాధ ఆక్షేపించారు.
టీడీపీ హయాంలో జరిగిన ఘటనకు ఆనాడు చంద్రబాబునాయుడు తీసుకున్న చర్యలకు నిందితుడు భయపడి ఉరి వేసుకున్నాడని, కానీ ఈ ప్రభుత్వంలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు అచ్చోసిన ఆంబోతులా సమాజంలో ఇంకా తిరుగుతున్నాడని, అటువంటి వ్యక్తికి వైకాపా ప్రభుత్వం కొమ్ము కాస్తోందంటూ ఆమె ధ్వజమెత్తారు. కాసు మహేష్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న నరేంద్రరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసాతోపాటు న్యాయం చేయాలని, బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ములక సత్యవాణి, ఆచంట సునీత, పానకాల వెంకటమహాలక్ష్మి, సుధాశశి తదితరులు పాల్గొన్నారు.