ఎన్నారై టెక్కీకి టోకరా, లక్షలు కొట్టేశారు: యువతితో ఫోన్లో మాట్లాడించి...

By telugu team  |  First Published Oct 22, 2020, 8:37 AM IST

ఏపీలో గుంటూరు జిల్లాలో ఓ ముఠా ఎన్నారై టెక్కీకి టోకరా వేసింది. పెళ్లి సంబంధం పేరుతో ఓ యువతితో ఫోన్ లో మాట్లాడించి లక్షల రూపాయలు కొట్టేసి పత్తా లేకుండా పోయింది.


గుంటూరు: పెళ్లి సంబంధం పేరుతో ఓ ముఠా వేసిన వలలో ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీరు చిక్కుకుని విలవిలలాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో ఈ సంఘటన వెలుగు చూసింది. తెనాలి చెంచుపేటకు చెందిన యువకుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. 

పెళ్లి సంబంధం కోసం అతను మ్యాట్రిమోనీని ఆశ్రయించాడు. 13 రోజుల క్రితం తెనాలిలోని యువకుడి తాతయ్యను మైనేని శ్రీనివాస్, దేవి అనే ఇద్దరు సంప్రదించారు. తాము చెన్నైలో ప్రొఫెసర్లమని, తమ కూతురు సముద్ర న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనచేస్తోందని నమ్మబలికారు. వేతనం లక్షా 10 వేల డాలర్లు అని కూడా బుకాయించారు. హెచ్-1 వీసా కూడా ఉందని చెప్పారు. 

Latest Videos

నాయనమ్మ ఆరోగ్యం సంక్రాంతి తర్వాత పెళ్లి చేద్దామని, ఈ నెల 25వ తేదీన పసుపు కుంకుమలు పెట్టుకుందామని కూడా చెప్పారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు తమ స్వగ్రామమని, అక్కడ సముద్ర పేరు మీద 25 ఎకరాల పొలం ఉందని చెప్పారు. ఎన్నారై వరుడికి సముద్ర ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మాట్లాడించారు. 

నిశ్చితార్థానికి 7.22 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, దుస్తులు తెనాలిలో కొనుగోలు చేశారు. ఆ మొత్తాన్ని అమెరికా నుంచి ఆన్ లైన్ లో ఆయా దుకాణాలకు చెల్లింపులు జరిపాడు. బుధవారం తమ ఊరు వస్తే మాట్లాడుకుందామని చెప్పారు. దాంతో యువకుడి తాత, కుటుంబ సభ్యులు బుధవారం ఉలవపాడుకు వెళ్లారు. 

వారు ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. గ్రామంలో విచారించగా ఆ పేర్లతో ఎవరూ లేరని తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 

click me!