ఏపిలో ప్రస్తుతం అస్తవ్యస్తపాలన సాగుతోందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదని ఆరోపించారు.
అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను పూర్తిగా కూలిపోయిందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు విమర్శించారు. చంద్రబాబు పెట్టుబడిదారుల్లో కల్పించిన నమ్మకాన్ని జగన్ కోల్పోయేలా చేశారని..దాని ఫలితంగానే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుబడిపోయినట్లు ఆరోపించారు.
ఇదిలా వుంటే మరోవైపు సామాన్యులపై ఇసుకబారం మోపి భవన నిర్మాన కార్మికులు రొడ్డెక్కే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. నూతన ఇసుక విధానం వైకాపా శ్రేణుల్ని పోషించటానికే తెచ్చారని..ఇసుక మాఫియాలో మంత్రులు కూడా ఉంటూ ప్రజా శ్రేయస్సు గాలికొదిలేశారని కాస్త ఘాటుగా విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
వైకాపా నేతలు నిర్వహించే ఇసుక రీచ్ లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగుదేశం పోరాడుతుందన్నారు. తెలుగుదేశం చేపట్టిన ఉచిత ఇసుక విధానాన్ని యధాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగానికి కనీసం 50శాతం కూడా ఇసుక అవసరాలు తీర్చటంలేదన్నారు. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది.
అప్పు ఎలా తీరుస్తారు అని ఎస్బిఐ అడగటం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. జగన్ ప్రభుత్వం పై బ్యాంకర్లలోనూ విశ్వాసం లేదనటానికి ఎస్బీఐ లేఖే నిదర్శనమని సుజయ్ కృష్ణ రంగారావు ఆరోపించారు.