విద్యను వ్యాపారంగా మారుస్తుంటే ఏం చేశారు... అధికారులపై విద్యామంత్రి ఆగ్రహం

By Arun Kumar PFirst Published Oct 21, 2019, 9:13 PM IST
Highlights

విద్యాశాఖ అధికారులపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు.గతంలో విద్యను వ్యాపారంగా మారుస్తుంటే మీరు చూస్తూ ఎలా వున్నారంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆగ్రహానికి  లోనయ్యారు.  

అమరావతి: భాద్యతగా పనిచేసి నిబంధనల అమలులో ఖచ్చితంగా వ్యవహరించాలని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.  రాష్ట్రం లోని అన్ని జిల్లాల ఆర్ఐఓ లతో సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి సమావేశమయ్యారు. ఈ క్రమంలో ప్రైవేట్ కళాశాలల  వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రయివేట్ కళాశాలల్లో నిభందనలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్ని కళాశాలల్లో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?  నిబంధనల ప్రకారం ఏర్పాట్లు ఉన్నాయా?  అగ్నిమాపక శాఖ నిభందనలు అమలులో ఉన్నావా? ఆట స్థలాలు ఉన్నాయా?  అంటూ ఆర్‌ఐఓ లపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు.

కళాశాలలను తనిఖీలు చేసి నిభందనలు అమలుచేయని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ  వారిపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల నేమ్ బోర్డు లు ఇష్టారీతిగా లేకుండా అన్నీ ఒకే తరహాలో ఉండాలనీ.. అందుకు నిర్దేశించిన విషయాలను అములు చేయని కళాశాలల బోర్డులు తొలగించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కళాశాల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టారని... ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలకు తగినట్టు భాద్యతగా పని చేయాలన్నారు. 10 రోజుల్లో ప్రతి ఒక్కరి పనితీరు మారాలని...గత ప్రభుత్వ కాలంలో ఉన్నట్టు కాకుండా  ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు.

విద్యను వ్యాపార ధోరణితో చూసే కళాశాలలపై తప్పక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు చిత్తశుద్ధి తో పని చేయాలని ఆదేశించారు. భాద్యతలు విస్మరించేవారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్,  కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రామకృష్ణ తో పాటు మరికొందరు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

 

click me!