ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా విషయంలో చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్ నెస్ లేకపోవడం వల్లే ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదని టిడిపి రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య మండిపడ్డారు.
గుంటూరు: కరోనా మహమ్మారిని ప్రజలంతా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, వైరస్ ప్రభావం, దాని వ్యాప్తిపై వారిలో సీరియస్ నెస్ లేదని, అందుకు కారణం ముఖ్యమంత్రి వ్యాఖ్యలేనని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైనట్లు కనిపించడంలేదని, వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం ఇప్పటికీ తేలిగ్గానే తీసుకుంటోందన్నారు. గతంలో బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ తో కరోనా నయమవుతుందని, ఇప్పుడేమో కరోనా కొరియాలో పుట్టిందని ముఖ్యమంత్రి మాట్లాడటం చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రజలెవరూ కరోనాను ప్రాణాంతకమైనదిగా భావించడంలేదని వర్ల తెలిపారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలతోపాటు మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుకూడా ప్రజల్లో సీరియస్ నెస్ కలిగించడంలేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసి, వైరస్ ను ఎదుర్కొనేలా వారిని సన్నద్ధం చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రామయ్య దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కరోనాను సీరియస్ గా తీసుకుంటే ప్రజలు కూడా సీరియస్ గానే తీసుకుంటారన్నారు.
కరోనా మహమ్మారి ధాటికి దేశాలే తల్లడిల్లిపోతూ దాన్నెలా కట్టడిచేయాలా అంటూ తలకిందలవుతుంటే రాష్ట్రముఖ్యమంత్రిలో మాత్రం వైరస్ పట్ల సీరియస్ నెస్ ఎందుకు రావడంలేదని వర్ల ప్రశ్నించారు. బాధ్యత గల ప్రతిపక్షనేతగా, టీడీపీ తరుపున ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రిని సన్నద్దం చేయడానికే తాను విలేకరుల ముందుకొచ్చానని రామయ్య స్పష్టంచేశారు.
ప్రజల ఆరోగ్యంతో జగన్ ప్రభుత్వం చెడుగుడు ఆడుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన దృష్టిని ప్రజల ఆరోగ్యంపై పెట్టేలా చేయడం కోసమే తెలుగుదేశం పార్టీనేతగా తాను బయటకు వచ్చానన్నారు. కరోనా ప్రభావాన్ని ప్రజలకు తెలియచేయడంలో ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడుతున్నారో, వారి ముందుకు రావడానికి ఆయనెందుకు సంకోచిస్తున్నారో తెలియడంలేదన్నారు.
తన పార్టీకి నాలుగు రాజ్యసభ స్థానాలు వస్తాయో...రావో... తనపార్టీ ఎమ్మెల్యేలతో ఓటు ఎలా వేయించాలన్న అంశాలపై పెట్టిన శ్రద్ధను ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంపై పెట్టకపోవడం బాధాకరమని వర్ల వాపోయారు. ముఖ్యమంత్రి తక్షణమే ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తిగా తాను కోరుతున్నానన్నారు. కరోనా ప్రభావంపై ముఖ్యమంత్రి ఎంత సీరియస్ గా ఉన్నారో, ప్రజలు కూడా అంతే సీరియస్ గా ఉంటారన్నారు. ప్రభుత్వంఇచ్చిన పిలుపును ప్రజలు సీరియస్ గా తీసుకోవడంలేదన్నారు.
ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజలముందుకొచ్చి, కరోనా ప్రభావం గురించి వారికి అర్థమయ్యే లా చెప్పాలని, వారు బయటకురాకుండా చూడాలని ప్రభుత్వానికి చేతులెత్తి విజ్ఞప్తిచేస్తున్నట్లు రామయ్య చెప్పారు. విజయవాడ వన్ టౌన్ లో కరోనా సోకిన వ్యక్తిని గుర్తించారని, కానీ అక్కడున్న ప్రజలంతా యథేచ్ఛగా బయటతిరుగుతూనే ఉన్నారన్నారు.
ముఖ్యమంత్రి మారువేషంలో బయటకు వస్తే పరస్థితిఎలా ఉందో ఆయనకు అర్థమవుతుందన్నారు.
ఒక్కసారి మరణాలు మొదలైతే ఆపడం ఎవ్వరితరం కాదని... ఇటలీ, చైనాలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గ్రహించాలన్నారు. ముఖ్యమంత్రి తమకోసం మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం, ఆలోచన ప్రజల్లో కలిగేలా ఆయన ప్రతి రెండుగంటలకు ఒకసారి మీడియా ద్వారా వారినుద్దేశించి ప్రసంగించాలన్నారు.
కరోనాను ప్రజలంతా చాలా తేలికగా తీసుకోవడానికి ముమ్మాటికీ ముఖ్యమంత్రి వైఖరే కారణమన్నారు. రాజకీయం చేయడానికి ఇది సమయం కాదని, బాధ్యతకల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి పట్టించుకోవాలన్నారు. ప్రజలంతా కరోనా వ్యాప్తిని సీరియస్ గా తీసుకోవాలని, ఎవ్వరూ బయటకు రాకుండా స్వీయనిర్బంధం విధించుకోవాలని, టీడీపీ తరుపున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.