ప్రత్యేక హోదా ఎందుకు అవసరమంటే...: అమిత్ షాకు జగన్ వివరణ

By Arun Kumar P  |  First Published Oct 22, 2019, 3:12 PM IST

డిల్లీ పర్యటనలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇవాళ(మంగళవారం) అమిత్ షా తో భేటీ అయ్యాారు.ఈ సందర్బంగా ఏపి సమస్యలను కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లిన సీఎం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.  


న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో అతి ప్రధానమైన ప్రత్యేకహోదా హామీని నెరవేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. డిల్లీ పర్యటనలో భాగంగా జగన్ ఇవాళ(మంగళవారం) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఏపికి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిగాయి. వివిధ అంశాలపై సుమారు 45 నిమిషాలసేపు చర్చించారు.

ముఖ్యంగా సీఎం ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు కింద రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, నాగార్జునసాగర్‌, శ్రీశైలంకు గోదావరి వరదజలాల తరలింపుపై అమిత్‌షాతో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిని సీఎం మరోసారి కోరారు. 

Latest Videos

రాష్ట్ర విభజన పరిశ్రమలు, సేవారంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని అమిత్ షా కు జగన్ వివరించారు. గతంలో వీటి వాటా 76.2 శాతం వుండగా తాజాగా 68.2 శాతానికి తగ్గిందని తెలిపారు.. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని వివరించారు. ప్రధాన నగరాలైన చెన్నై, హైదరాబాద్‌, బెంగుళూరు కాకుండా పరిశ్రమలు ఏపీ వైపు చూడాలంటే ప్రత్యేక తరగతి హోదా ఉండాలన్న సీఎం తెలియజేశారు.

2014-2015లో రెవిన్యూ లోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారంటూ అమిత్‌షాకు జగన్ గుర్తుచేశారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18969.26 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి చెల్లించాల్సి ఉందని  హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ కోరారు.

 ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్‌ విభజన చట్టం ద్వారా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సహకరించాలన్నారు. అలాగే ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్నికూడా  ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వీటితోపాటు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులను సమకూర్చాల్సిందిగా ఆయన హోంమంత్రిని కోరారు.

వెనకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలని  ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలో వెనకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 రూపాయలు ఇస్తే, బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4000ఇస్తున్నారన్నారు. ఇదే తరహాలో ఏపీలోని వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాలని జగన్‌ కోరారుఏపీలో వెనకబడ్డ 7 జిల్లాలకు రూ.2100కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకూ రూ.1050 కోట్లుమాత్రమే ఇచ్చారని తెలిపారు.మిగిలిన మొత్తాన్ని వెంటనే విడుదలచేయాలన్నారు. 

పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఇందులో రూ.33వేలకోట్లు భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కే ఖర్చు అవుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదలచేయాలని కోరారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం రూ.16వేల కోట్లు ఇవ్వాలన్నారు. వీలైనంత త్వరలో నిధులు ఇవ్వడానికి సంబంధిత మంత్రిత్వశాఖను సూచించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.838 కోట్ల ప్రజాధానాన్ని ఆదాచేశామని అమిత్‌షాకు తెలిపారు. హెడ్‌ వర్క్స్‌, హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయ్యాయన్నారు.

 నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి వరద జలాల తరలింపు అంశాన్ని అమిత్‌షాతో చర్చించారు.కృష్ణానదిలో గడచిన 52 సంవత్సరాల్లో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరోవైపు గోదావరిలో గడచిన 30 సంవత్సరాలుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు.

 కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణాడెల్టా సహా తాగునీరు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు గోదావరి వరదజలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలను ఆదేశించాలని  సీఎం కోరారు. దీనివల్ల రాష్ట్రంలోని సాగునీరు, తాగునీరు కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మారుతాయని అమిత్ షాకు జగన్ వివరించారు. 
 

click me!