వారు నారావారు కాదు సారావారు: చంద్రబాబుపై రోజా ‘జబర్దస్త్’ కామెంట్స్

By Siva KodatiFirst Published Mar 3, 2020, 3:45 PM IST
Highlights

మందు బాటిళ్లను ఆఫీసులో ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా..? బార్ షాపా అని రోజా సెటైర్లు వేశారు. నారా వారి పాలన సారా పాలనలా వుందని.. ప్రతి సంవత్సరం టార్గెట్లు ఇచ్చి మరీ మద్యాన్ని ఏరులై పారించారని ఆమె మండిపడ్డారు

మందు బాటిళ్లను ఆఫీసులో ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా..? బార్ షాపా అని రోజా సెటైర్లు వేశారు. నారా వారి పాలన సారా పాలనలా వుందని.. ప్రతి సంవత్సరం టార్గెట్లు ఇచ్చి మరీ మద్యాన్ని ఏరులై పారించారని ఆమె మండిపడ్డారు

మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు పదవిలోంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులు ఉన్నాయని ఆరోపించారు. ప్రతి ఏడు 20 శాతం మద్యం అమ్మకాలు పెంచుకుంటూ పోయిన చంద్రబాబు పాలనను మహిళలు మరచిపోలేదని ఆమె దుయ్యబట్టారు.

Also Read:విదేశాలకు డబ్బులు,చంద్రబాబు జైలుకే: రోజా

కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారని రోజా చెప్పారు. నారా వారి పాలన సారా పాలనలా వుందని.. ప్రతి సంవత్సరం టార్గెట్లు ఇచ్చి మరీ మద్యాన్ని ఏరులై పారించారని ఆమె మండిపడ్డారు.

లిక్కర్ సిండికేట్‌లతో చేతులు కలిపి టీడీపీ నేతలు దోచుకున్నారని.. అప్పటి మంత్రి జవహర్ బీర్‌ను హెల్త్ డ్రింక్ అంటూ ప్రమోటర్‌లా పనిచేశారని రోజా ఎద్దేవా చేశారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని వాలంటీర్లు స్వయంగా ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారని వాళ్లు వాలంటీర్లు కాదని, వారియర్లని ఆమె ప్రశంసించారు.

అలాంటి వాలంటీర్లపైనా టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రోజా దుయ్యబట్టారు. మద్యాన్ని డోర్ డెలీవరి చేసినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే తాము పదవులకు రాజీనామా చేస్తామని ఆమె సవాల్ విసిరారు.స్థానిక ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ప్రజల చేతుల్లో చీత్కారం తప్పదని రోజా స్పష్టం చేశారు.

Also Read:తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు: రోజా తీవ్ర వ్యాఖ్యలు

మహిళ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అసెంబ్లీలో ఆ అమ్మాయితో బ్రాండ్ల పేర్లు చెప్పించేంతగా చంద్రబాబు దిగజారిపోయారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మహిళల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని రోజా తెలిపారు.

టీడీపీ ఆఫీసులో లిక్కర్ బాటిళ్లను ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాల్సిందిగా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పసుపు-కుంకుమ పథకంతో మోసం చేసేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు మహిళలు బుద్ధిచెప్పారని రోజా గుర్తుచేశారు. ప్రభుత్వాధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే అదుపు చేయకుండా వారితో చంద్రబాబు సెటిల్‌మెంట్స్ చేశారని ఆమె ఎద్దేవా చేశారు. 

click me!