ఓటేసినా, వేయకపోయినా గెలవాలన్నదే జగన్ వ్యూహం... ఎలాగంటే: కళా వెంకట్రావు

By Arun Kumar PFirst Published Mar 7, 2020, 4:02 PM IST
Highlights

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి ఎన్నికల కమిటీని నియమించడం జరిగిందని... అదేవిధంగా కమాండ్ కంట్రోల్ టీమ్ ల పేరుతో రాష్ట్రంలోని 5జోన్లకు 5కమిటీలు వేయడం జరిగిందన్నారు ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెెంకట్రావు. 

గుంటూరు: స్థానిక ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మరీముఖ్యంగా బీసీ, మైనారిటీలను వంచించడానికి సిధ్దమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు.  రిజర్వేషన్లకు కోతపెట్టడం ద్వారా బడుగు, బలహీనవర్గాలను, ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు మద్ధతు తెలపడం ద్వారా మైనారిటీలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని స్పష్టం చేశారు. 

శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించి స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి ఎన్నికల కమిటీని నియమించడం జరిగిందని... అదేవిధంగా కమాండ్ కంట్రోల్ టీమ్ ల పేరుతో రాష్ట్రంలోని 5జోన్లకు 5కమిటీలు వేయడం జరిగిందన్నారు.  ఈ రెండు కమిటీల్లోని బృందాలుకూడా ఎన్నికల నిర్వహణ కోసం సమిష్టిగా పనిచేస్తాయని వెంకట్రావు తెలిపారు. ఈ కమిటీలన్నీ కూడా ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రతిరోజూ సమీక్షలు జరుపుతాయన్నారు. 

వాటితోపాటుగా పార్లమెంటరీ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని, జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల కమిటీ, అసెంబ్లీ స్థాయిలో నియోజకవర్గ స్థాయి సమన్వయ ఎన్నికల కమిటీ, మండల,డివిజన్, గ్రామస్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కార్యకర్తలను సమాయత్తం చేసుకుంటూ వారి సమన్వయంతో ఈ కమిటీలన్నీ పనిచేస్తాయని కళా వెంకట్రావు స్పష్టంచేశారు. 

రాష్ట్రస్థాయి కమిటీలో సభ్యులుగా కిమిడి కళా వెంకట్రావు (పార్టీ రాష్ట్ర అధ్యక్షులు), యనమల రామకృష్ణుడు (మాజీమంత్రి), నారా లోకేశ్ (పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి), కింజారపు అచ్చెన్నాయుడు (మాజీమంత్రి, టీడీఎల్పీ నేత) వర్ల రామయ్య (పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు), ఆలపాటి రాజేంద్రప్రసాద్ (మాజీమంత్రి), బొండా ఉమామహేశ్వరరావు (మాజీ మంత్రి), గుమ్మడి సంధ్యారాణి (ఎమ్మెల్సీ), మహమ్మద్ ఫరూక్ (మాజీమంత్రి), కాలవ శ్రీనివాసులు (మాజీమంత్రి), తెనాలి శ్రావణ్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే), శ్రీనివాసులు రెడ్డి (కడప జిల్లా పార్టీ అధ్యక్షులు) ఉన్నట్లు కళా వెంకట్రావు తెలిపారు. 

read more  అవినాష్ ఆత్మహత్యాయత్నానికి కారణాలివే... : చంద్రబాబు ఆగ్రహం

ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుంటుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. తన 9నెలల పాలనలో జగన్ చేసిన నిర్వాకాలు, పాలన వైఫల్యాలే స్థానిక ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని అందిస్తాయని కళా స్పష్టంచేశారు.

 బీసీలకు 34శాతంగా ఉన్న రిజర్వేషన్లను రాష్ట్రప్రభుత్వం 10శాతం తగ్గించిందని, దానివల్ల వివిధస్థాయిల్లో 16వేలమంది బీసీలు ప్రాతినిధ్యం కోల్పోతున్న నేపథ్యంపై కూడా పార్టీ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఆలోచన లేకుండా ఏదోవిధంగా ఎన్నికలు నిర్వహించాలన్న తాపత్రయమే ప్రభుత్వంలో అధికంగా కనిపిస్తోందన్నారు. 

పోలీస్ వ్యవస్థను, ఎన్నికల్ల విధుల్లో పాల్గొనే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎన్నికలను మమ అనిపించి గెలవాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని...బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయడంలేదన్నారు. ప్రజలు ఓటువేసినా, వేయకపోయినా, వ్యవస్థలను ఉపయోగించుకొని గెలవాలన్న దురాలోచనలోనే జగన్ ప్రభుత్వం ఉందని కళా తెలిపారు. 

తనపై ఉన్న కేసులుకోసం అనుభవజ్ఞుడైన న్యాయవాదిని నియమించుకున్న జగన్మోహన్ రెడ్డి 16వేల పదవులు కోల్పోతున్న బీసీలకోసం మాత్రం సరైనా న్యాయవాదిని నియమించకపోవడం శోచనీయమన్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ బిల్లుకు మద్ధతు తెలిపి మైనారిటీలకు చేయాల్సిన అన్యాయమంతా చేసేసిన జగన్ సర్కారు ఏదో కంటితుడుపు చర్యగా ఎన్నికల డ్రామాలో భాగంగా వారిని అనునయించే ప్రయత్నాలకు తెరలేపిందన్నారు. బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు ఎన్నికలవేళ ప్రజలకు చేసిన వాగ్ధానాల గురించి, అధికారంలోకి వచ్చాక ఏం చేశారనే దానిగురించి ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. 

9నెలల్లో అనేక అంశాలపై మాటతప్పి, మడమ తిప్పిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో గెలిచాక తిరిగి అదే ప్రజలను అధికారమనే మడమతో అణచివేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఒకమార్పు తీసుకొచ్చారని, ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంచినా, గెలిచాక కూడా పంచారని తెలిసినా, వారిపై చర్యలు తీసుకొని పదవికి అనర్హులని తేల్చడంతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టం చేశారన్నారు. దాన్ని అడ్డుపెట్టుకొని అధికారులు, పోలీసుల సాయంతో ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్యోద్దేశమన్నారు. దానికి ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఉదంతమేనన్నారు. 

read more   ''ఓడితే ఇంటికే''... ముఖ్యమంత్రి జగన్ కూడా రాజీనామా...: బుద్దా వెంకన్న సవాల్

మాజీ సర్పంచ్ అయిన అవినాశ్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో ఉంచి వేధింపులకు గురిచేసి అదే పీఎస్ పై నుంచి దూకి అతను ఆత్మహత్యాయత్నం చేసేలా ప్రభుత్వమే దారుణానికి ఒడిగట్టిందన్నారు. ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడినవారంతా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారని కళా స్పష్టంచేశారు.

9నెలల నుంచీ రాజ్యాంగానికి విరుద్ధంగా, వ్యవస్థల సాయంతో సాగుతున్న రాక్షసపాలనకు చరమగీతం పాడే అవకాశం ప్రజలకు వచ్చిందని...వారు బాగా ఆలోచించి  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళా వెంకట్రావు పిలుపునిచ్చారు.  గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిందని, చంద్రన్నబీమా, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, పెండ్లికానుక, నిరుద్యోగభృతి, అన్నక్యాంటీన్ల మూసివేత వంటి వాటిద్వారా ప్రజలకు ఏంచేసిందో వారే ఆలోచించాలన్నారు. 

ఒక్క అవకాశమంటూ గద్దెనెక్కిన పెద్దమనిషి తమకు ఏం చేశాడో, ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలుచేశాడో ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.జగన్ ప్రభుత్వం రైతులకు అనధికారికంగా రూ.4వేలకోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, సంక్రాంతి వెళ్లినా నేటికీ వారికివ్వాల్సిన బకాయిల గురించి ప్రభుత్వ పెద్దలెవరూ ఆలోచించడం లేదన్నారు. 

ప్రజల సమస్యల పరిష్కారంలో జగన్ ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో, రాష్ట్రంలో అధికంగా ఉన్న హరిజన, గిరిజన, బడుగు, బలహీనవర్గాల వారికి ఏం ఒరగబెట్టిందో వారికి వారే ఆలోచించాలన్నారు. ఆయావర్గాలన్నీ తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయని కళా తెలిపారు. ప్రజలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రే పోలీసుల సాయంతో వారిపై కక్షసాధింపులకు పాల్పడటం ఎంతటి దారుణమో తెలుసుకోవాలన్నారు. 

జగన్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేలా, ప్రజల గురించి ఆలోచించేలా చేసే ఒకేఒక్క అవకాశం స్థానిక ఎన్నికలరూపంలో జనానికి దొరికిందని, దాన్ని వారు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలన్నారు కళా వెంకట్రావు. 
 

click me!