ఆంధ్ర ప్రదేశ్ అవతరణ ధినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవర్భంగా అసెంబ్లీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అమరావతి: నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మనసు పెట్టి ఏకాగ్రతతో, అకుంఠిత దీక్షతో, సానుకూల దృక్పథంతో, అంకితభావంతో, రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం సచివాలయంలోని అసెంబ్లీ హాల్ మొదటి సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరగలేదని గుర్తేచేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు నేడు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు.
మద్రాసు రాజధానిగా ఉన్న సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక పరిపాలన విభాగం కావాలని పట్టుబట్టడం జరిగిందని... అది రోజురోజుకూ తీవ్రతరమై ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందన్నారు. మద్రాసు అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు రాజధానిగా పరిపాలన సాగించడం జరిగిందని, తదుపరి మరల ప్రత్యేక నినాదం రావడంతో హైదరాబాద్ ను రాజధాని చేయడం జరిగిందని గుర్తుచేశారు.
read more రాస్కో చూస్కో అన్నారు, ఇప్పుడేమంటారు : బాబును నిలదీసిన మంత్రి అనిల్
రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణకు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ ను రాజధానిగా నిర్ణయించడం జరిగిందన్నారు. హైదరాబాద్ రాజధాని అభివృద్ధిలోనూ ఆంధ్రుల పాత్ర ఉన్నదని... పలు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడిన ఆంధ్రులు వారి స్వంత రాష్ట్రాభివృద్ధికి నడుంకట్టి ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు.
సువిశాల ఆంధ్రప్రదేశ్ ను ముక్కలుచెక్కలు చేసి 2014వ సంవత్సరంలో రాష్ట్రాన్ని విభజించారన్నారని గుర్తుచేశారు. విభజనానంతరం పరిపాలన సౌలభ్యం కోసం రాత్రికి రాత్రి ఉద్యోగస్థులను సైతం అమరావతిలో విధులు నిర్వర్తించేలా తీసుకురావడం శోచనీయమన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాభివృద్ధిని ఒకే చోట కాకుండా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరముందని అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.విడిపోయి కలిసి ఉందాం అన్న నినాదంతో ఇరు రాష్ట్రాలు ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు.
శాసనమండలి ఛైర్మన్ ఎండీ షరీఫ్ మాట్లాడుతూ... విధానపరంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు నిర్వహించిన ఉద్యమం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి చేసిందన్నారు. ఆ ఉద్యమ తీవ్రతను గుర్తించిన నాటి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్ర ఆవిర్భావాన్ని గుర్తెరిగి కర్నూలు రాజధానిగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు.
read more ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు, జగన్ ఫ్యామిలీ ఫుల్ హ్యపీ: జోష్ లో వైసీపీ
అనంతరం పలు కారణాల రీత్యా హైదరాబాద్ ను రాజధాని చేయడం జరింగిందన్నారు. సుమారు 60 సంవత్సరాల పాటు హైదరాబాద్ అభివృద్ధికి ఆంధ్రులు అవిరళ కృషి చేశారన్నారు. చరిత్రను రాబోయే తరాలకు సైతం తెలిసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
1972లో జైఆంధ్ర ఉద్యమం సమయంలో రాష్ట్రాన్ని విభజించి ఉంటే నేటికి అభివృద్ధిలో ముందుండేవాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. 2014లో విడిపోయి పలు ఇబ్బందులకు గురికావడం జరిగిందన్నారు. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నాయని నూతన రాజధాని ఏర్పాటు ఆవశ్యకత ఉన్నదన్నారు. రాజధాని నిర్మాణానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా చెందాలని తెలిపారు.
శాసన ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ... 1913 మే 25న బాపట్లలో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు పెద్దలు నిర్ణయించడం జరిగిందన్నారు. తదనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసువులు సైతం లెక్కచేయకుండా పోరాడిన పొట్టి శ్రీరాములు అకుంఠిత దీక్షతో నిరాహార దీక్ష చేశారన్నారు. తెలుగు భాష అభ్యున్నతి, ఆత్మగౌరవం పెంపొందించే విధంగా, తెలుగు భాష ప్రత్యేకతను కాపాడే విధంగా చర్యలు చేపట్టారన్నారు.
రానున్న రోజుల్లో తెలుగు భాషపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఏబీసీడీ వరుస క్రమంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిన విధంగా అభివృద్ధి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 స్థానంలో నిలిపే విధంగా అందరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తొలుత సభాపతి, ఉపసభాపతి, శాసనమండలి ఛైర్మన్ లు అమరజీవి పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సిబ్బంది సహా పలువురు పాల్గొన్నారు. అసెంబ్లీ సిబ్బంది జనగణమన, మా తెలుగుతల్లి గీతాలను ఆలపించారు.