ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ భేటీ అయ్యారు.
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం సంసిద్దమవుతోంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు, ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎన్నికల కమీషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారులను పలు సలహాలు, సూచనలిచ్చారు. తమ పరిధిలోని జిల్లాల్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు, ఎన్నికల సామాగ్రి తరలింపు, పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేశారు.
ఎన్నికల నియమావళి అమలుతో పాటు హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఎస్పీలకు సూచనలిచ్చారు. ఓటర్ల జాబితా విడుదల, పోలింగ్ బూత్‌ల గుర్తింపునకు సంబంధించి నోటిఫికేషన్ కంటే లోపే వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
మొత్తం రెండు దశల్లో ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. తొలి దశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. 17,494 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నట్లు తెలిపారు. తొలి దశలో కోటి 45లక్షల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొననున్నట్లు ఎన్నికల కమీషనర్ తెలిపారు.
రెండో దశలో 327 జడ్పీటీసీలు, 4,960 ఎంపీటీసీలకు పోలింగ్ జరగనున్నాయి. 16,831 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు. రెండో దశలో సుమారు కోటి 36లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వుందన్నారు. రెండు దశల్లో కలిసి 2లక్షల 18వేల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.