కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శుభవార్త... ఏపి కేబినెట్ కీలక నిర్ణయం

By Arun Kumar P  |  First Published Nov 27, 2019, 7:17 PM IST

ఏపి రాజధాని అమరావతి వేదికన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు మంత్రి పుష్ఫ శ్రీవాణి తెలిపారు. ఈ  క్రమంలోనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నిర్ణయాలను కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. 


అమరావతి: రాష్ట్రంలో గిరిజనులకు ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ నియమించాలని బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఐటీడీఏల పరిధిలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల గౌరవ వేతనాలను రూ.400 నుంచి రూ.4000లకు పెంచాలని కూడా నిర్ణయించినట్లు వెల్లడించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉండగా దానివల్ల తమకు అనుకున్నమేరకు న్యాయం జరగడంలేదన్నారు. అందుకే ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ నియమించాలంటూ రాష్ట్రంలోని గిరిజనులు అందరూ కోరుకున్నారని తెలిపారు. వారి అభీష్టం ప్రకారంగానే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్టీ కమిషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన విషయాన్ని  గుర్తుచేశారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పెట్టడం  జరిగిందని పుష్ప శ్రీవాణి  తెలిపారు.  

Latest Videos

ఇచ్చిన మాట ప్రకారంగానే వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారన్నారు. అందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనిలో  భాగంగానే ఇటీవల జరిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) సమావేశంలో రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానంతో ఆమోదించడం జరిగిందని గుర్తు చేసారు. 

read more అలా చేస్తే సీఎం చేతకానివాడని వాళ్లకూ తెలిసిపోతుంది: వైసిపి ఎంపీతో టిడిపి ఎమ్మెల్సీ

బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని ఆమోదించడం జరిగిందని వివరించారు. కేబినెట్ లో ఆమోదం పొందిన ఈ అంశంపై అసెంబ్లీలో బిల్లు పెట్టి  ఆమోదం పొందిన తర్వాత, కేంద్రం నుంచి కూడా ఆమోదం తీసుకొని  ఎస్టీ కమిషన్ ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారమౌతాయని అభిప్రాయపడ్డారు. గిరిజనుల కోరిక మేరకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రికి పుష్ప శ్రీవాణి ధన్యవాదాలు తెలిపారు.

read more  వైఎస్సార్ వాహనమిత్ర రూ.400 కోట్లు...రెండో విడత పంపిణీ చేపట్టిన పేర్ని నాని

రూ.400 నుంచి రూ.4000లకు పెరిగిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనం 

కాగా రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల(సి.హెచ్.డబ్ల్యు)కు ప్రస్తుతం చెల్లిస్తున్న నెలసరి గౌరవ వేతనాన్ని రూ.400 నుంచి రూ.4వేలకు పెంచాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించడం జరిగిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్ల తరహాలోనే ఐటీడీఏల పరిధిలోని గిరిజన ఆవాసాలలో సి.హెచ్.డబ్ల్యులు సేవలను అందిస్తున్నారని... ప్రతి గిరిజన ఆవాసంలో ఒకరు చొప్పున పని చేస్తున్నారని చెప్పారు. 

ప్రస్తుతం సీతంపేట ఐటీడీఏ పరిధిలో 498 మంది, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1184 మంది, పాడేరు ఐటీడీఏ పరిధిలో 752 మంది సి.హెచ్.డబ్ల్యులు పని చేస్తుండగా చింతూరు ఐటీడీఏ పరిధిలో 40 మంది, కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 163 మంది సి.హెచ్.డబ్ల్యులు పని చేస్తున్నారన్నారు. మొత్తం 7 ఐటీడీఏల  పరిధిలో 2651 మంది సి.హెచ్.డబ్ల్యులు పని చేస్తుండగా వారందరి గౌరవవేతనాలను పెంచడం జరిగిందని వివరించారు. పెరిగిన ఈ వేతనాలను వచ్చే నెల నుంచి వారికి చెల్లించనున్నట్లు మంత్రి శ్రీవాణి తెలిపారు.


 

click me!