ఆ మంత్రి సోదరుడి దౌర్జన్యం తట్టుకోలేకపోతున్నాం: చంద్రబాబుకు దివ్యాంగుడి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Oct 16, 2019, 9:25 PM IST
Highlights

టిడిపి జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పార్టీ కార్యాలయానికి విచ్చేసి ప్రజా సమస్యల గురించి తెెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.   

'' మా అమ్మనుంచి వారసత్వంగా నాకు వచ్చిన 2ఎకరాల పొలంలోకి వెళ్లడానికి బాట లేకుండా తవ్వించేశారు. నా భూమి ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాపై దౌర్జన్యం చేయడమే కాకుండా మళ్లీ ఎదురు కేసులు నాపై బనాయిస్తామని బెదిరిస్తున్నారు. మంత్రి మోపిదేవి సోదరుడు హరనాథ్ బాబు, నర్రా సుబ్బయ్య దౌర్జన్యాలు తట్టుకోలేక పోతున్నాను. మీరే కాపాడాలి.'' అంటూ ఓ దివ్యాంగుడు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు కు మొరపెట్టుకున్నాడు. 

 గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడికి  నిజాంపట్నం మండలం పడమటి పాలెంకు చెందిన శిఖినం నాగబాబు అనే దివ్యాంగుడు తన ఆవేదన ను తెలియజేశాడు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, దానికి సంబంధించిన సమాచారం టిడిపి లీగల్ సెల్ ప్రతినిధులకు ఇవ్వాలని సూచించారు. ఇలాగే ధైర్యంగా పోరాడాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయంగా, న్యాయపరంగా తగిన సహకారం పార్టీ తరఫున అందిస్తామని చంద్రాబాబు తెలిపారు. 

 ఇక రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతతో పనులు నిలిచిపోయి పస్తులు ఉంటున్నామని పెయింటర్ వెంకయ్య వాపోయారు. చంద్రబాబు పాలనలో రోడ్లు, భవనాల నిర్మాణం, ప్రాజెక్టుల పనులతో, వేలాది కూలీలతో కళకళ లాడిన రాజధాని గ్రామాలు, ప్రస్తుతం పనులు లేక, కూలీలు వెళ్లిపోయి వెలాతెలా పోతున్నాయన్నారు. దీనిపై  చంద్రబాబు స్పందిస్తూ అభివృద్ది ఆగిపోయిందని, పనులు నిలిచిపోయాయని, నిర్మాణాల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. 

ఒకప్పుడు ఇసుకపై టిడిపిని విమర్శించిన వైసిపి నేతలు, ఇప్పుడు స్థానికంగా అసలు ఇసుకే లేకుండా, పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది కార్మికులు, తాపీ మేస్త్రీలు,ఎలక్ట్రిసియన్లు,ప్లంబర్లు,పెయింటర్లు అనేక వృత్తుల వారు పనులు కోల్పోయారని, పేద కుటుంబాలు పస్తులుంటున్నారని ఆవేదన చెందారు. దీన్ని వెంటనే చక్కదిద్దుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు. 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాలనుంచి చంద్రబాబును కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి చంద్రబాబు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 
 

click me!