రాజధాని కోసం సాగుతున్న అమరావతి ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. తమ పిల్లల భవిష్యత్ పై బెంగతో ఓ మహిళా రైతు ప్రాణాలను కోల్పోయిన విషాదం తుళ్ళూరులో చోటుచేసుకుంది.
అమరావతి: రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధానిని తరలించడం వల్ల తమ ప్రాంతంలో అభివృద్ది నిలిచిపోయి పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనన్న బెంగతో కొందరు కుమిలిపోతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఇప్పటికే పలువురు మృతిచెందగా తాజాగా తూళ్లూరు మరో మహిళా రైతు మృత్యువాతపడ్డారు.
తుళ్ళూరు మండలం నెలపాడు గ్రామానికి చెందిన కర్నాటి ఎర్రమ్మ(74 ) మంగళవారం మద్యాహ్నం మృతిచెందారు. రాజధాని అమరావతి నుండి తరలిపోతుందని ఆవేదనకు గురయిన ఈమె నాలుగు రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదని కుటుంంబసభ్యులు తెలిపారు. దీంతో ఇవాళ ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోగా ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు.
మృతురాలికి రెండెకరాల భూమి ఉంది. కొడుకులు లేకపోవడంతో ఆ రెండెకరాలను ఇద్దరు కుతుర్లకు సమానంగా పంచింది. అయితే గతంలో రాజధాని రాకతో ఆ భూమికి భారీ డిమాండ్ పెరిగ్గా తాజాగా వైసిపి ప్రభుత్వ నిర్ణయంతో బాగా తగ్గింది. దీంతో పిల్లల భవిష్యత్ గురించి మనోవేదనకు గురైన ఆమె మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
read more ఆ వెధవ పని చేసింది చంద్రబాబే... రాజధానిపై ఉద్యోగ సంఘం నేత కీలక వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న నిరసనల్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం వెలగపూడికి చెందిన గోపాలరావు అనే వృద్దుడు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న తన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త విని తట్టుకోలేక గుండెపోటుకు గురయి మృతిచెందాడు.
రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న క్రమంలో మందడంలో ఆదివారం ఓ రైతు స్పహ తప్పిపడిపోయాడు. ఇలా అనారోగ్యంపాలయిన రైతు సాయంత్రం మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే.
తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి సుబ్బయ్య అనే రైతు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి ఏమి తినకపోవడంతో ఆదివారం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.
ఇప్పటికే రాజధాని తరలిస్తున్నారని పుట్టెడు బాధలో వున్నరైతులను మరణాలు మరింత బాధిస్తున్నారు. తమతో పాటు ఉద్యమం చేస్తున్న సహచరులు హటాత్తుగా మరణిస్తుండటం అందరినీ ఎంతగానో బాధిస్తోంది. ఇలా నిన్న చనిపోయిన రైతు కుటుంబాన్ని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించారు.