విజయవాడ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో నైట్ షూటింగ్ లు పెట్టుకుంటున్నారని, తను చేస్తున్న సినిమాల్లో ఉన్న నైట్ సీన్స్ ఇక్కడ పూర్తి చేస్తారని వినికిడి.
ఏపీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో పవన్ వరుస ప్రాజెక్టులు సైన్ చేసి పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల సమయానికి సైన్ చైసిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. అలా చూసుకుంటే పవన్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. అందుకు ఆయన రాత్రింబవళ్లూ కష్టపడాలని ఫిక్స్ అయ్యారు.
రాబోయే నెలల్లో పవన్ కళ్యాణ్ షూటింగ్ లు ఎక్కువ శాతం విజయవాడ చుట్టు ప్రక్కల ప్లాన్ చేసారని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. వారాహి యాత్ర లో భాగంగా ఆయన విజయవాడ కేంద్రంగా పర్యటనలు చేస్తారని అంటున్నారు. విజయవాడలోనే స్టే చేస్తారని చెప్తున్నారు. దాంతో విజయవాడ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో నైట్ షూటింగ్ లు పెట్టుకుంటున్నారని, తను చేస్తున్న సినిమాల్లో ఉన్న నైట్ సీన్స్ ఇక్కడ పూర్తి చేస్తారని వినికిడి. పగలంతా యాత్రలో పాల్గొని, నైట్ ఇలా షూటింగ్ లో పాల్గొనగలరా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు అవకాసం ఉన్న సీన్స్ ప్లాన్ చేసి తీస్తారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ జూన్ 14న వారాహి యాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కత్తిపూడి నుండి ఈ యాత్ర ప్రారంభించనున్నారు పవన్. ఇటీవలే వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాదెండ్ల మనోహర్ ఇప్పటికే విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుండి పవన్ యాత్రను ప్రారంభించనున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలలో జనసేనకి ఎక్కువ బలం ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఈ జిల్లాల్లో పవన్ కల్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలతో పవన్ భేటీ అయి ప్రజల సమస్యలను అడిగి పవన్ తెలుసుకోనున్నారు.
ఈ యాత్రకి సంబంధించి అటు పోలీసులు, ఇటు జనసైనికులతో తూర్పుగోదావరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భక్తుల భద్రత దృష్ట్యా బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని అన్నవరం ఆలయ ఈవో కోరారు. పవన్ దర్శనంపై అధికారిక సమాచారం లేదని ఆలయ ఈవో చెబుతున్నారు. జనసేన వర్గాలు మాత్రం ముందే పోలీసులకు సమాచారం అందించామని చెబుతున్నారు. పోలీసుల పర్మిషన్ రాకపోయినా యాత్రకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు.
రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్ కల్యాణ్. వారాహి యాత్రలో భాగంగా నేడు సాయంత్రానికి అన్నవరం చేరుకోనున్నారు. కాగా, రత్నగిరి కొండపై భక్తుల రద్దీ ఉంది. దీంతో సత్యగిరి కొండపై గెస్ట్ హౌస్ లో రాత్రికి పవన్ బస చేయనున్నారు. అనంతరం కత్తిపూడిలో బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రం వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కావాలని పోలీసులు కోరుతున్నారు.