
Plants Care in Summer: మొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు, గాలిని కూడా శుభ్రం చేస్తాయి. వాటిని ఇంట్లో, బాల్కనీలో, లేదా టెర్రస్‌పై ఎక్కడ పెట్టినా సరే... అవి పచ్చగా, ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లల్ని చూసుకున్నట్టే వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మొక్కలు వాడిపోతాయి.
ముఖ్యంగా వేసవి కాలంలో ఎండలు, వేడి గాలికి మొక్కలు ఎండిపోవడం, వేర్లు కుళ్లిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి టైంలో కొన్ని సహజమైన ఎరువులను వాడి మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వేసవిలో మీ మొక్కలు పచ్చగా ఉండాలంటే ఏ ఎరువులు వాడాలో, వాటిని ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
మొక్కలు బాగా పూలు పూసి, కాయలు కాయాలంటే పొటాషియం చాలా అవసరం. ఇది అరటి తొక్కల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ ఎరువు కోసం, అరటి తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, రెండు మూడు రోజులు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని మొక్కల కుండీల్లో పోయాలి. ఇది వేసవిలో మొక్కలకు బలాన్ని ఇచ్చి, మట్టిని సారవంతం చేస్తుంది.
మనం అన్నం వండే ముందు బియ్యం కడుగుతాం కదా.. ఆ నీళ్లను పారేయకుండా మొక్కలకు వాడితే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మొక్కలకు మేలు చేసే పోషకాలు, స్టార్చ్ ఉంటాయి. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపి ఆకులపై స్ప్రే చేయవచ్చు, లేదా నేరుగా మట్టిలో పోయవచ్చు. బియ్యనీరు వేసవి ఎండల్లో కూడా మట్టిలో తేమను నిలిపి ఉంచుతుంది.
వేపలో సహజంగానే క్రిమిసంహారక గుణాలు ఉంటాయి. వేసవిలో మొక్కలకు పురుగులు పట్టకుండా ఇది కాపాడుతుంది. ఈ స్ప్రే చేయడానికి, కొన్ని వేపాకుల్ని నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత వడగట్టి, స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు స్ప్రే చేస్తే పురుగులు రాకుండా ఉంటాయి, మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి.
మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా, మొక్కల ఆకులను రోగాల బారి నుంచి కాపాడుతుంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ స్ప్రే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి, ఒక లీటర్ మజ్జిగకు మూడు రెట్లు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆకులపై స్ప్రే చేయాలి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించి, మొక్కలకు చల్లదనాన్ని ఇస్తుంది.
మన వంటింటి వ్యర్థాలతో తయారుచేసిన కంపోస్ట్‌ను 24 నుంచి 48 గంటల పాటు నీళ్లలో నానబెడితే కంపోస్ట్ టీ రెడీ అవుతుంది. ఈ ద్రవ ఎరువును వడగట్టి మొక్కల వేళ్ల దగ్గర పోయవచ్చు లేదా ఆకులపై స్ప్రే చేయవచ్చు. ఇది మొక్కలకు వెంటనే పోషణ అందించి, వేసవిలో కూడా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.