మంచులో మామిడి తోట.. ఒక్కోపండు రూ.19వేలు మాత్రమే.. ఎక్కడంటే...

First Published | May 9, 2023, 3:26 PM IST

జపాన్‌లోని ఉత్తర ద్వీపంలోని మంచుతో కూడిన తోకాచి ప్రాంతంలో ఓ వ్యక్తి మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఒక్కో పండును 230 డాలర్ల చొప్పున అమ్ముతున్నాడు.

జపాన్‌ : వేసవి పండు మామిడి. ఓ వైపు వేడి చంపేస్తుంటే మరోవైపు మామిడి తీపి ఊరిస్తుంది. అయితే, జపాన్ లో ఓ రైతు మాత్రం గడ్డకట్టించే మంచులో మామిడి పండ్లు కాయిస్తున్నాడు. ఈ పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఒక్కో పండును 230డాలర్లు, అంటే అక్షరాలా రూ.19వేలకు అమ్ముతున్నాడు. ఇంతకీ దీని వివరాలు ఏంటంటే..

జపాన్ లోని హక్కైడో ద్వీపంలోని ఓటోఫుక్‌లోని తన పొలం వద్ద పొగమంచుతో కూడిన గ్రీన్‌హౌస్ లోపల తెల్లటి ట్యాంక్ టాప్ ధరించిన హిరోయుకి నకగావా పండిన మామిడి పండ్లను ప్యాక్ చేసి రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచాడు.  -8C ఉష్ణోగ్రత ఉండే డిసెంబర్ నెలలో అతని గ్రీన్‌హౌస్ లోపల 36Cఉష్ణోగ్రత ఉంటుంది.


నకగావా 2011 నుండి జపాన్‌లోని ఉత్తర ద్వీపంలోని మంచు తోకచి ప్రాంతంలో మామిడి పండ్లను పండిస్తున్నాడు. అతను వాటిని ఒక్కొక్కటి 230 డాలర్లకి విక్రయిస్తున్నాడు. సస్టైనబుల్ ఫార్మింగ్ చేస్తున్న ప్రయోగం ఒకరోజు తనకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను దిగుబడి చేసేలా చేస్తుందని అతను ఎప్పుడూ అనుకోలేదు.

"మొదట ఎవరూ నన్ను సీరియస్‌గా తీసుకోలేదు" అని గతంలో పెట్రోలియం కంపెనీని నడిపిన 62 ఏళ్ల నకగావా చెప్పారు. చమురు వ్యాపారంలో సంవత్సరాల తరబడి ఉన్న ఆయన ఆ తరువాత మామిడి సాగుకు మారాడు, అక్కడ పెరుగుతున్న ధరలు శిలాజ ఇంధనాలకు అతీతంగా చూడవలసిన అవసరాన్ని గుర్తించేలా చేశాయి. 

శీతాకాలంలో కూడా మామిడి పండ్లను పండించడం సాధ్యమని ఓ మామిడి రైతు నకగావాకు తెలిపాడు. అతని మార్గదర్శకత్వంలో నకగావా తన వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించాడు. తన స్టార్టప్ పేరును నోరావర్క్స్ జపాన్‌గా పెట్టాడు. కొన్ని సంవత్సరాల్లోనే అతను పండించే మామిడి పళ్లకు  బ్రాండ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ బ్రాండ్ హకుగిన్ నో తైయోగా ట్రేడ్‌మార్క్ అయ్యింది. అంటే దీని అర్థం.. మంచులో సూరీడు అట.

నకగావా విజయ రహస్యం ఏమిటంటే, అతని స్వస్థలమైన హక్కైడో ప్రసిద్ధి చెందిన రెండు సహజ వనరులను తన పంటకు ఉపయోగించడం - మంచు, ఒన్సెన్ వేడి నీటి బుగ్గలు.  శీతాకాలంలో మంచును నిల్వ చేస్తాడు. వేసవిలో తన గ్రీన్‌హౌస్‌లను చల్లబరచడానికి ఉపయోగిస్తాడు, పండ్లు పండడం ఆలస్యం అయ్యేలా చేస్తాడు. శీతాకాలంలో అతను గ్రీన్‌హౌస్‌ను వేడి చేయడానికి సహజమైన వేడి నీటి బుగ్గలను ఉపయోగిస్తాడు.

అలా సీజన్‌లో దాదాపు 5,000 మామిడి పండ్లను పండిస్తాడు.సహజమైన కొన్ని కీటకాలను పురుగుమందులకు బదులుగా వాడతాడు. తక్కువ తేమ వాతావరణం కూడా రసాయనాల అవసరాన్ని తగ్గిస్తుంది. అదనంగా, శీతాకాలంలో పంట రావడం వల్ల.. మరో ఉపయోగం.. ఆ సమయంలో కార్మికులకు పెద్దగా పని ఉండదు. రైతులూ ఖాళీగానే ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి కాస్త పని దొరుకుతుంది. 

మంచి రంగు, రుచితో ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లు ఎలా ఉత్పత్తి చేయబడుతున్నాయి అనేది కస్టమర్లకు ఆసక్తిగా మారింది. మొదటిసారి 2014లో ఇసేటాన్  అనే ఓడిపార్ట్‌మెంట్ స్టోర్ తన మామిడి పండ్లలో ఒకదానిని దాదాపు 400డాలర్లకి అమ్మింది. 

దీంతో ఈ వార్త పతాక శీర్షికలకు ఎక్కింది, మరింత మంది దృష్టిని ఆకర్షించింది. నకగావా క్లయింట్‌లలో ఆసియాస్ బెస్ట్ ఫిమేల్ చెఫ్ 2022 నాట్సుకో షోజీ వంటి రెస్టారెంట్‌లు కూడా ఉన్నాయి. ఆమె మామిడి ప్లేవర్ కేకులలో పండ్లను ఉపయోగిస్తుంది. 

Latest Videos

click me!