మిలియన్ల మంది ప్రయాణికులు రోజూ ఇండియన్ రైల్వేస్‌పై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ముంబై, డిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు సమీపంలో నివసించే వారు రోజూ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వీళ్లే కాకుండా సంక్రాంతి, దసరా, క్రిస్మస్, వంటి ముఖ్యమైన పండగలకు సొంతూర్లకి తక్కువ ఖర్చుతో వెళ్లాలనుకున్న వారు కూడా జనరల్ టికెట్ తీసుకుంటారు.
ఇంతకు ముందు జనరల్ టికెట్ అంటే రైల్వే స్టేషన్లోని కౌంటర్ లో మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. దీంతో పెద్ద క్యూలో గంటల తరబడి నిలబడి మరీ టికెట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు.
ఇప్పుడు జనరల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. UTS (అన్‌రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌తో మీరు సులభంగా ఆన్‌లైన్‌లో జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు. రైలు ప్రయాణం చాలా సులభం అవుతుంది.
ఇదే కాకుండా ప్రతి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్లాట్ ఫారం టికెట్, జనరల్ టికెట్ ఇచ్చే మెషీన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇవి కూడా ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.
మరి ఇలా ఆన్‌లైన్ లో జనరల్ టికెట్ తీసుకున్న వారు ఎంత సమయం లోపు వాటిని ఉపయోగించాలో తెలుసా?
ఇండియన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం, ఆన్‌లైన్ లో తీసుకున్న జనరల్ టికెట్ 3 గంటల్లోపు ఉపయోగించాలి. ఆన్ లైన్ లో టికెట్ తీసుకుని మీరు స్టేషన్ కి వచ్చే లోపు మీరు ఎక్కాల్సిన ట్రైన్ వెళ్లిపోతే తర్వాత ట్రైన్ ఎక్కుతారు కదా.. అది కచ్చితంగా 3 గంటల లోపు వచ్చే ట్రైన్ అయి ఉండాలి.
ఆన్ లైన్ లో టికెట్ తీసుకొన్న టైమ్ నుంచి 3 గంటల్లోపు మీరు టికెట్ ఉపయోగించకపోతే ఇకపై అది చెల్లదు. దాన్నే ఉపయోగించి మీరు ట్రైన్ ఎక్కేస్తే టిటిఇ కి ఫైన్ కట్టక తప్పదు. టికెట్ వ్యాలిడిటీ లోపు ప్రయాణించకపోతే అది టికెట్ లేని ప్రయాణం చేసినట్లు అవుతుంది. దీనికి రూ.250 వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది.
ఈ ఫైన్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎంతంటే.. రైలు స్టార్ట్ అయిన స్టేషన్ నుండి మీరు ప్రయాణిస్తున్నారని టీటీఈ భావించి ఫైన్ వేయడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి జరిమానాలను నివారించడానికి టికెట్ వ్యాలిడిటీ లోపు ప్రయాణం చేయండి. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ మిస్ అయితే మీ జర్నీ విసుగ్గా మారుతుంది. ఈ రూల్స్ పాటిస్తూ హ్యాపీగా జర్నీ చేసేయండి.