తిరుమల లడ్డు సంగతి సరే ... యాదాద్రి ప్రసాదంలో ఏ నెయ్యిని వాడుతున్నారో తెలుసా?

First Published | Sep 26, 2024, 5:41 PM IST

తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించి కల్తీ చేసిన నెయ్యిని వాడారంటూ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదంలో ఏ నెయ్యిని వాడుతున్నారో తెలుసా? 

Anumula Revanth Reddy

Telangana : ఈ కలికాలంలో ఎక్కడచూసినా కల్తీయే ... మనుషులు తినే ఆహారం నుండి పశువుల దాణా వరకు ప్రతిది కల్తీ చేస్తున్నారు. అగ్గిపుల్ల,సబ్బుబిల్ల, కుక్కపిల్ల... కవితకు కాదేది అనర్హం అన్నాడో కవి... కానీ పాలు, పండ్లు, ఫుడ్... కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు కొందరు స్వార్థపరులు. చివరకు ఈ కల్తీ సెగ కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని తాకింది... తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించారన్న అనుమానాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

తిరుమల లడ్డు వ్యవహారం బైటపడటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ప్రసాదం తయారీపై ప్రత్యేక దృష్టిపెట్టింది రేవంత్ సర్కార్. ఇకపై ప్రైవేట్ సంస్థల నుండి కాకుండా ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీ నుండే నెయ్యిని కొనుగోలు చేయాలని అన్ని దేవాలయాలను ఆదేశించింది ప్రభుత్వం. మరీముఖ్యంగా దేవుళ్లకు సమర్పించే ప్రసాదాలు ఆగమశాస్త్రం ప్రకారమే తయారుచేయాలని...  ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ నెయ్యి విషయంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. 
 

Vijaya Dairy

విజయ డెయిరీ నెయ్యితోనే లడ్డూలు, ప్రసాదాలు : 

తిరుమల తిరుపతి దేవస్ధానం మాదిరిగానే తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో కూడా ప్రైవేట్ సంస్థల నుండి కొనుగోలు చేసిన నెయ్యితోనే ప్రసాదాలు తయారుచేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారం బైటపడి దుమారం రేగుతుండటంతో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తం అయ్యింది. ఇప్పటివరకు కొనసాగించిన పద్దతిలో కాకుండా కేవలం ప్రభుత్వ డెయిరీ సంస్థ నుండే నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 

టెండర్ విధానాన్ని పక్కనబెట్టి ఇకపై కేవలం విజయ డెయిరీ నుండి మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ డెయిరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి కల్తీకి ఆస్కారం లేకుండా చూడవచ్చు.ఇలా నాణ్యమైన పదార్థాలతో ప్రసాదాలను అందించి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

తెలంగాణలో రూ.25 లక్షల నుండి కోటి రూపాయలకు పైగా ఆదాయం కలిగిన ఆలయాలు 350  నుండి 400 వరకు వున్నాయి. ఆ ఆలయాలన్ని దేవాదాయ శాఖ పరిధిలో వున్నాయి... వీటిని నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శిస్తుంటారు. ఆయా దేవాలయాల్లో లభించే లడ్డూ,పులిహోరతో పాటు ఇతర  ప్రసాదాలను చాలా పవిత్రంగా భావిస్తుంటారు. కానీ ఇంతకాలం ఈ ప్రసాదాలను ప్రైవేట్ సంస్థలు సరఫరా చేసే నెయ్యినే ఉపయోగిస్తున్నారు. 

టెండర్ల ద్వారా నెయ్యి సరఫరా చేసే బాధ్యతను ప్రైవేట్ డెయిరీ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఎవరు తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేయడానికి ఒప్పుకుంటే వారినుండి కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇలా తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసే క్రమంలో కల్తీ జరిగే అవకాశాలున్నాయి. తిరుమలలో ఇలాగే జరిగింది. ఈ నేపథ్యంలోనే టెండర్లను పక్కనబెట్టి ఇకపై విజయ డెయిరీ నుండే నెయ్యిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 


vijaya dairy

విజయ డెయిరీకి ఊరట : 

ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేకపోతుంది. దీంతో ఈ డెయిరీ పదార్థాలకు మార్కెట్ లో డిమాండ్ బాగా తగ్గింది. మరీముఖ్యంగా విజయ డెయిరీ నెయ్యిని కొనేవాళ్లు లేకపోవడంతో భారీగా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో రాష్ట్రంలోని దేవాలయాల్లో వినియోగించేందుకు ఈ నెయ్యిని కొనుగోలు చేయాలని ఇటీవలే విజయ డెయిరీ అధికారులు దేవాదాయ శాఖను కోరారు. కానీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. 

కానీ తాజాగా తిరుమల వివాదం తర్వాత దేవాదాయ శాఖనే స్వయంగా విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో విజయ డెయిరీకి భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన వేములవాడ, వరంగల్ భద్రకాళి, ధర్మపురితో పాటు అనేక దేవాలయాలు విజయ డెయిరీ నెయ్యి కొనుగోలుకు సిద్దమయ్యాయి.    

Yadadri Temple

తెలంగాణ తిరుపతి యాదాద్రి ప్రసాదంలో ఏ నెయ్యి వాడతారో తెలుసా? 

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల లాగే తెలంగాణలో యాదగిరిగుట్ట ప్రముఖ దేవాలయం. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పున:నిర్మించింది. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఆలయానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నరసింహస్వామిని దర్శించుకోవడంతో పాటు యాదాద్రి అందాలను వీక్షించేందుకు వేలాదిమంది తరలివెళుతుంటారు... వారాంతాల్లో అయితే యాదిగిరిగుట్ట ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. 

యాదాద్రి ఆలయానికి వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకుని లడ్డూ, పులిహోర ప్రసాదాన్ని తీసుకుంటారు. ఇలా యాదాద్రిలో ప్రతిరోజు 20 నుండి 30 వేల వరకు లడ్డూలను భక్తులు కొనుగోలు చేస్తారు... వారాంతాల్లో ఈ సంఖ్య ఎక్కువగా వుంటుంది. అయితే ఈ ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కేంద్ర ప్రభుత్వ సంస్థ మదర్ డెయిరీ నుండి కొనుగోలు చేస్తున్నారు యాదాద్రి ఆలయ అధికారులు. 

మదర్ డెయిరీ నెయ్యిని అన్ని నాణ్యతా పరీక్షలు నిర్వహించాకే యాదాద్రి ఆలయానికి సరఫరా చేస్తుంది. కానీ ఆలయ అధికారులు కూడా మరోసారి  హైదరాబాద్ నాచారంలోని ప్రభుత్వ ల్యాబ్ కు పంపి నాణ్యతా పరీక్షలు చేయిస్తారు. అంతా సరిగ్గా వుందని తేలితేనే ఆ నెయ్యిని ప్రసాదాల తయారీలో ఉపయోగిస్తారు. ఇలా ఎలాంటి కల్తీ లేకుండా సరఫరా చేస్తున్నారు కాబట్టే కిలో నెయ్యికి రూ.609 చెల్లిస్తున్నట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు.
 

Tirupati Laddu

తిరుమల లడ్డు వివాదంపై తెలంగాణ నేతల కామెంట్స్ : 

తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉపయోగించారన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి రాజేసింది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి కావడంతో తెలంగాణ బిజెపి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే తిరుమల లడ్డూ కల్తీ హిందూమతంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. గతంలో అన్యమతస్తులను టిటిడి ఛైర్మన్లుగా నియమించినప్పుడే తాను గొంతెత్తానని... ఇప్పుడు అంతకంటే మహాపాపం బైటపడిందన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డులో జంతువుల మాంసంతో కూడిన నెయ్యిని కలపడం సిగ్గుచేటంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మాజీ  సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ అయ్యారు. 

మరో తెలంగాణ బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తిరుమల లడ్డు వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ... వెంకటేశ్వర స్వామిని ప్రతి హిందువు ఆరాధిస్తాడు. అలాంటి ఆలయ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారని తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని అన్నారు. ఇలాంటి అపవిత్రపు పనులు చేసినవారే ఇప్పుడు తిరుమలకు వెళ్లి ఆ దేవుడిని దర్శించుకుంటారట అంటూ వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై రాజాసింగ్ సెటైర్లు వేసారు.  

హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవిలత అయితే ఏకంగా ఆ తిరుమలేశుడికే లేఖ రాసారు. వందే భారత్ రైలులో ఓ బృందంలో కలిసి తిరుమలకు పయనమైన ఆమె ఈ లేఖను హుండీలో వేయనున్నట్లు తెలిపారు. కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లిన ఆమె ప్రాయశ్చిత్త పూజలు చేసారు. 

కేవలం బిజెపి నాయకులే కాదు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వంటి తెలంగాణ నేతలు కూడా తిరుమల లడ్డు వ్యవహారంపై స్పందించారు. మత విశ్వాసాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తామని అసద్ పేర్కొన్నారు. ఇక జగ్గారెడ్డి టిడిపి,జనసేనలతో కలిసి బిజెపి కుట్రలు పన్నుతోందని ... హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చి ఏపీలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇదంతా ఏపీ ప్రజలు గమనిస్తున్నారు... రాబోయే రోజుల్లో ఈ కుట్రలన్నింటిని భగ్నం చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 
 

Latest Videos

click me!