తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ... మీరు అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా?

First Published | Sep 20, 2024, 11:57 PM IST

తెలంగాణ రాష్ట్రంలో చాలాకాలం తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ చేపట్టనున్నారు. ఈ దిశగా రేవంత్ సర్కార్ కీలక చర్యలు తీసుకుంటోంది. మరి మీరు రేషన్ కార్డు పొందేందుకు అర్హులో కాదో తెలుసుకొండి.

Ration Cards

Ration Cards : తెలంగాణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి చర్చించిన కీలక అంశాల్లో ఈ రేషన్ కార్డుల అంశం కూడా వుంది. కొత్త రేషన్ కార్డులపై విధివిధానాలను రూపొందించేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై మంత్రిమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. 

Ration Cards

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి కొత్త రేషన్ కార్డుల డిమాండ్ వినిపిస్తూనే వుంది. ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో దీనిపై హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల అక్టోబర్ నుండి అర్హులైన ప్రతిఒక్కరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ... ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిమండలిలో నిర్ణయించారు. 

దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక పాత, కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది (2025) ఆరంభంనుండే సన్నబియ్యం అందించాలని రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది. 
 


Ration Cards

కొత్త రేషన్ కార్డు అర్హతలు :

ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెల అక్టోబర్ నుండే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ రేషన్ కార్డు పొందేందుకు కావాల్సిన అర్హతలను మాత్రం ప్రకటించలేదు. సెప్టెంబర్ 21 అంటే రేపు కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధివిధాలను ప్రకటించే అవకాశాలున్నాయి. 

గతంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం గ్రామాల్లో అయితే లక్షన్నర లోపు, పట్టణాల్లో   అయితే రెండు లక్షల లోపు ఆదాయం కలిగిన వారే రేషన్ కార్డులకు అర్హులుగా నిర్ణయించారు. అలాగే 3.5 ఎకరాల లోపు మాగాణి లేదంటే 7.5 ఎకరాల లోపు మెట్ట భూమి వున్నవారినే అర్హులుగా పేర్కొన్నారు. 

అయితే ఇటీవల రేషన్ కార్డుల జారీపై ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా పరిశీస్తున్నామని... ముఖ్యంగా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆదాయ పరిమితి పెంచాలా? తగ్గించాలా? లేక ఇదివరకు ప్రకటించినంతే వుంచాలా? అనేదానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనిపైన కూడా ఇవాళ కేబినెట్ భేటిలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది... దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి వుండటంతో దీన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. 

Telangana Cabinet

తెలంగాణ కేబినెట్ ఇతర నిర్ణయాలు : 
 
హైడ్రాను మరింత బలోపేతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హైడ్రాకు అవసరమైన సిబ్బందిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిప్యుటేషన్ పై వివిధ విభాగాల నుండి హైడ్రాకు 169 మంది అధికారులను, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. 

హైదరాబాద్ చుట్టూ ఏర్పాటుచేయనున్న ఆర్ఆర్ఆర్ పై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం అలైన్ మెంట్ ఖరారుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో మరికొన్ని ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. 8 వైద్య కళాశాలల్లో బోధనా, బోధనేతర సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. మొత్తంగా 3 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి వేగంగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. 

ఎన్నికల హామీలో భాగమైన వరికి రూ.500 బోనస్ పై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఖరీఫ్ నుండే కనీస మద్దతు ధరకు అదనంగా మరో 500 రూపాయలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని  నిర్ణయించారు. 

మనోహరాబాద్ లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్, ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారాశ్రామిక పార్క్, ఏటూరు నాగారంలో 34 మంది సిబ్బందితో ఫైర్ స్టేషన్, కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్, హకీంపేటలో జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

Latest Videos

click me!