Telangana Congress
Bomma Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న సస్పెన్స్ కు తెరపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది మొదలు కొత్త టిపిసిసి చీఫ్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో సాగింది. ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ చీప్ బాధ్యతలు సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కు దక్కాయి.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామక ప్రక్రియ చాలాకాలంగా సాగుతోంది. పోటీ ఎక్కువగా వుండటంతో ఇంతకాలం సాగదీస్తూ వచ్చింది జాతీయ నాయకత్వం. మిగతా ఆశావహులకు నచ్చజెప్పి, రాష్ట్రంలోని అగ్ర నాయకులందరి ఆమోదంతో కొత్త పిసిసిని నియమించారని... ఇలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకే ఆలస్యం అయినట్లే కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.
అయితే చివరివరకు ఇద్దరు గౌడ సామాజికవర్గానికి చెందిన నాయకుల మధ్యనే పోటీ నెలకొంది. మాజీ ఎంపీ,సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ కూడా పిసిసి రేసులో బలంగా నిలిచారు. చివరకు వివాద రహితుడు, విద్యార్థి దశనుండి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ వైపే అదిష్టానం మొగ్గుచూపింది. ఆయనకే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది.
Bomma Mahesh Kumar Goud
ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ :
బొమ్మ మహేష్ కుమార్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. భీంగల్ మండలం రహత్ నగర్ లో 1966 ఫిబ్రవరి 24న ఈయన జన్మించారు. తండ్రి గంగాధర్ గౌడ్ కు కులవృత్తే జీవనాదారం. దిగువ మద్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన మహేష్ కుమార్ కు విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. నిజామాబాద్ లో డిగ్రీ చేసే సమయంలో స్టూడెంట్ రాజకీయాలు ప్రారంభించారు.
నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ లో చేరాడు. ఈ స్టూడెంట్ యూనియన్ లో యాక్టివ్ గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తారు. స్టూడెంట్ యూనియన్ లో కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేసాడు... దీంతో అతడికి కాంగ్రెస్ యువజన విభాగంలో చోటుదక్కింది. ఇలా విద్యార్థి నాయకుడు కాస్త రాజకీయ నాయకుడిగా మారిపోయారు మహేష్ కుమార్ గౌడ్.
చాలా చిన్న వయసులో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం మహేష్ కుమార్ కు దక్కింది. 1994 లో డిచ్ పల్లి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఆయనకు సరైన అవకాశాలు దక్కలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాడు... పార్టీ మారే ప్రయత్నం చేయలేదు. ఇలా పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి తాజాగా పెద్ద ప్రతిఫలం దక్కింది.
Telangana Congress
టిపిసిసి బాధ్యతలు మహేష్ కుమార్ కే ఎందుకు?
తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించడం వెనక అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ అదిష్టానం తీవ్ర తర్జనభర్జన తర్వాతే ఈయన పేరును ఫైనల్ చేసింది. ఇలా మహేష్ కుమార్ కు పిసిసి పగ్గాలు దక్కడానికి కారణాలను పరిశీలిద్దాం.
1. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు :
మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరుంది. ఇంతకాలం రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా వుంటే మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషిచేసారు. ఇలా రేవంత్ తో సాన్నిహిత్యం మహేష్ కుమార్ టిపిసిసి చీఫ్ గా నియామకం కావడంలో సహాయపడింది.
2. సామాజికవర్గం :
మహేష్ కుమార్ గౌడ్ కు సామాజికవర్గం కలిసివచ్చింది. రెడ్డిల ఆధిపత్యం గల కాంగ్రెస్ కు బిసిలు దూరం అవుతున్నారు... వీరిని బిజెపి అక్కున చేర్చుకుంటోంది. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ బిసి లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందువల్లే బిసి సామాజికవర్గానికి చెందిన మహేష్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు పనిచేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తర్వాత కూడా మళ్లీ అగ్రకులాలకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. కాబట్టి ఈసారి బిసి వైపు కాంగ్రెస్ అదిష్టానం మొగ్గుచూపింది.
Telangana Congress
3. పార్టీపై విధేయత :
విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుండి టిపిసిసి చీఫ్ స్థాయికి ఎదిగారు మహేష్ కుమార్ గౌడ్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినవారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు... ఇలా కీలక నాయకులంతా పార్టీ మారినా మహేష్ కుమార్ మాత్రం ఆ ఆలోచన చేయలేదు. గత పదేళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా అందులోనే కొనసాగారు. ఇలా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన అతడికి పార్టీ పగ్గాలు దక్కాయి.
4. ఎమ్మెల్యే సీటు త్యాగం :
మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం వరుసగా రెండుసార్లు తాను పోటీచేద్దామన్న సీటును త్యాగం చేసారు. 2018 నిజామాబాద్ అర్బన్ నుండి పోటీకి సిద్దమయ్యారు... కానీ ఆ సీటును అదిష్టానం మైనారిటీలకు కేటాయించింది. అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పోటీ నుండి తప్పుకున్నారు. ఇటీవల 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి నిజామాబాద్ సీటును ఆశించారు. మళ్లీ ఆయనకు నిరాశే ఎదురయ్యింది.
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నా పోటీచేసే అవకాశం దక్కలేదు. అయినప్పటికీ ఆయన ఎలాంటి నిరాశకు గురికాలేదు. పార్టీ కోసం పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని నమ్మిన అతడు చాలా ఈజీగా రెండోసారి కూడా తన సీటును త్యాగం చేసారు. ఇది కూడా ఆయనకు పిసిసి చీఫ్ గా నియమించడానికి కారణం.
5. కాంగ్రెస్ నాయకులందరితో మంచి సంబంధాలు :
కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరితోనే కాదు కాంగ్రెస్ నాయకులందరితో మహేష్ కుమార్ గౌడ్ కు సత్సంబంధాలు వున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులందరితో ఈయన సఖ్యతగానే వుంటారు. కాబట్టీ ఈయన పేరునే అత్యధికులు టిపిసిసి చీఫ్ పదవి కోసం ప్రతిపాదించారట... దీంతో అదిష్టానం కూడా ఈయననే ఎంపిక చేసింది.
Telangana Congress
జగ్గారెడ్డి, మధుయాష్కి, సంపత్ కుమార్ కంటే మహేష్ కుమార్ ఎందుకు ప్రత్యేకం :
మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, మధుయాష్కి గౌడ్, సంపత్ కుమార్ పేర్లు కూడా టిపిసిసి చీఫ్ రేసులో వినిపించాయి. అయితే వీరందరికీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది... కానీ ఓడిపోయారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం తన సీటును త్యాగం చేసారు. ఇలా పార్టీకోసం నిస్వార్థంగా వ్యవహరించిన మహేష్ కుమార్ టిపిసిసి పగ్గాలు దక్కాయి.