Khammam Floods
Khammam Floods : నేను హ్యాపీగా వుంటేచాలు... ఎవరు ఎలాపోతే నాకేంటి అనుకునే మనుషులే ఈ కలికాలంలో ఎక్కువగా వున్నారు. ఇలాంటి కాలంలో కూడా కొందరు మానవత్వం ఇంకా బ్రతికేవుందని గుర్తుచేస్తుంటారు... అలాంటివాడే సుభాన్ ఖాన్. తన ప్రాణలను రిస్క్ లో పెట్టిమరీ ఎదుటివారి ప్రాణాలు కాపాడేవారు ఎంతమంది వుంటారు... సుభాన్ ఈ పని చేసాడు. వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న నదీ ప్రవాహంలో చిక్కుకున్న తొమ్మిదిమందిని కాపాడి హీరో అయిపోయాడు సుభానీ.
Khammam Floods
అసలేం జరిగింది :
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహించే నదులు, వాగులు వంకలు వరదనీటితో ప్రమాదకరంగా మారాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇలా వరద ప్రవాహం పెరగడంతో నీరంతా జనావాసాల్లోకి చేరింది.
ఇలా ఏపీలో బుడమేరు విజయవాడను ముంచినట్లే తెలంగాణలో మున్నేరు ఖమ్మంను ముంచింది. భారీగా వరదనీరు చేరడంతో ప్రమాదకరంగా మారిన మున్నేరు భీభత్సం సృష్టించింది. గత ఆదివారం ఖమ్మం నగరమంతా జలమయం అయ్యింది.
మున్నేరు నది వరద ఉదృతిలో ప్రమాదవశాత్తు కొందరు చిక్కుకున్నారు. ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరుపై వంతెన వుంది... అప్పటికే ఆ వంతెనను ఆనుకుని ప్రవాహం సాగుతోంది. ఇలాంటి సమయంలోనే 9 మంది ఈ వంతెనపైకి చేరుకుని ఓవైపు నుండి మరోవైపు వెళ్ళే ప్రయత్నం చేసారు.
అయితే సరిగ్గా వంతెన మధ్యలోకి చేరుకోగానే మున్నేరు నీటి ప్రవాహం పెరింగింది. దీంతో రెండువైపులా నీరుచేరి వీరు మధ్యలో చిక్కుకున్నారు. ముందుకే కాదు వెనక్కి వెళ్లడానికి వీలు లేకుండా చిక్కుకుపోయారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు వీరిని మింగేస్తుందని అందరూ భావించారు. కానీ అప్పుడే హీరోలా ఎంటర్ అయ్యాడు సుభాన్ ఖాన్.
Khammam Floods
సుభాన్ ఖాన్ సాహసం :
మున్నేరు నదిలో చిక్కుకున్నవారిని కాపాడాలంటే హెలికాప్టర్ రావాల్సిందే. లేదంటే ప్రవాహ ఉదృతిని దాటుకుని వెళ్లి వారిని కాపాడటం అసాధ్యమని అక్కడికి చేరుకున్న అధికారులు తేల్చేసారు. ఉన్నతాధికారులతో మాట్లాడి హెలికాప్టర్ తెప్పించేందుకు యత్నించారు... కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు.
సమయం గడిచిపోతోంది... మున్నేరు వరద అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఏం చేయాలో సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన అధికారులకు అర్థం కావడంలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వంతెనవద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. కానీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి.
ఇలా రాత్రి అయ్యింది... కానీ మున్నేరు నదిలో చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చే మార్గం కనిపించడంలేదు. దీంతో అక్కడేవున్న జెసిబి యజమాని ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన జేసిబిని వరద ఉదృతిలోనే పంపించేందుకు సిద్దమయ్యాడు. తనవద్ద పనిచేసే జెసిబి డ్రైవర్ సుభానీని సంప్రదించాడు.
నదిలో చిక్కుకున్నవారు ఎవరో తెలియదు... తన కుటుంబసభ్యులో, బంధువులో కాదు... తన ప్రాణాలను రిస్క్ చేసి వీరిని ఎందుకు కాపాడాలి అని జెసిబి డ్రైవర్ అనుకునివుంటే రెస్క్యూ ఆపరేషన్ ముందుకుసాగేది కాదు. కానీ సుభానీ అలా అనుకోలేదు...మానవత్వాన్ని ప్రదర్శించాడు. నదిలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ముందుకు వచ్చి పెద్ద సాహసం చేసాడు.
Khammam Floods
జెసిబిలతో విధ్వంసమే కాదు ప్రాణాలు కాపాడవచ్చు :
అధికార యంత్రాంగం ఏం చేయలేక చేతులెత్తేసారు... మున్నేరు నదిలో చిక్కుకున్నవారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సమయంలో జెసిబితో ఎంటర్ అయ్యాడు సుభాన్ ఖాన్. నదీ ఉదృతిని ఏమాత్రం లెక్కచేయకుండా చిక్కుకున్నవారిని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు కదిలాడు.
వరదనీటిలో జెసిబిని ముందుకు పోనిచ్చాడు సుభానీ. మెల్లిగా జెసిబి టైర్లు, ఆ తర్వాత బాడీ... ఇలా ముందుకు వెళుతున్నకొద్ది మునిగిపోతూ వుంది. నదీప్రవాహ ఉదృతికి ఆ వాహనాన్ని నెట్టివేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అత్యంత చాకచక్యంగా జెసిబిని ముందుకు పోనిచ్చాడు సుభానీ.
జెసిబి మొత్తం నీటిలో మునిగిపోయింది... కేవలం పైన క్యాబిన్ మాత్రమే బయట వుంది. ఇలా సాహసం చేసి ఎట్టకేలకు వంతెనపై చిక్కుకున్నవారి వద్దకు చేరుకున్నాడు. వారిని జెసిబిలో ఎక్కించుకుని తిరిగి అదే నీటిలో వెనక్కి వచ్చాడు. ఇలా ధైర్యసాహసాలు ప్రదర్శించి నదిలో చిక్కుకున్నవారిని సురక్షితంగా కాపాడాడు సుభానీ.
Khammam Floods
ఓవర్ నైట్ లో హీరోగా మారిన సుభాని :
మున్నేరు నదిలో చిక్కుకున్నవారిని తన ప్రాణాలకు తెగించి కాపాడిన జెసిబి డ్రైవర్ సుభాన్ ఖాన్ హీరో అయిపోయాడు. అతడు జెసిబితో నదిలోకి వెళ్లి 9మందిని కాపాడిన సంఘటనను అక్కడున్న కొందరు సెల్ ఫోన్లలో వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డ్రైవర్ సుభాన్ ఖాన్ తో పాటు జెసిబి యజమాని వెంకటరమణ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ తదితరులు కూడా వీరిని అభినందించారు. బిఆర్ఎస్ నేత క్రిషాంక్ ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసి... కాంగ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను కాపాడటంలో విఫలమైందని అన్నారు. కానీ సుభాన్ బాయ్ బుల్డొజర్ తో ఇళ్లను కూల్చేసి ప్రజలను రోడ్డున పడేయడమే కాదు ప్రాణాలను కాపాడవచ్చని నిరూపించాడంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చురకలు అంటించారు.
రాజకీయాలను పక్కనబెడితే... ఎక్కడో హర్యానా నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన సుభానీ 9 మంది ప్రాణాలు కాపాడాడు. ఆ దేవుడు ఇందుకోసమే అతడిని ఇక్కడికి పంపివుంటాడని ప్రాణాలతో బయటపడ్డవారు అంటున్నారు. సుభానీ కూడా పోతే నేను ఒక్కడినే... కానీ ధైర్యం చేస్తే 9 మంది ప్రాణాలు కాపాడగలనని అనుకునే ముందుకు వెళ్లానని చెబుతున్నాడు. లక్షల విలువచేసే జెసిబి కంటే మనిషుల ప్రాణాలే విలువైనవని భావించినట్లు యజమాని వెంకటరమణ అంటున్నాడు.